కొవాగ్జిన్ సామర్థ్యం 77.8శాతం

by Shamantha N |
కొవాగ్జిన్ సామర్థ్యం 77.8శాతం
X

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్ తుది దశ ప్రయోగాల ఫలితాలు వచ్చాయి. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో కొవాగ్జిన్ 77.8శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నిపుణుల కమిటీకి ఈ ఫలితాలను భారత్ బయోటెక్ సమర్పించింది. ఫలితాలను ఆమోదించి డీసీజీఐకి కమిటీ డేటాను పంపినట్టు సమాచారం.

మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని 25,800 మందిపై భారత్ బయోటెక్ ప్రయోగాలు చేసింది. తుది దశ ట్రయల్స్ వివరాలను మధ్యంతర ఫలితాల రూపంలో ఇప్పటికే విడుదల చేసినా, ఫైనల్ రిజల్ట్స్‌ను కేంద్రానికి సమర్పించింది. మార్చిలో విడుదల చేసిన తొలి మధ్యంతర ఫలితాలు టీకా సామర్థ్యం 81శాతంగా పేర్కొన్నాయి. ఈ టీకా కరోనాను తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడంతోపాటు హాస్పిటలైజేషన్‌లను నివారిస్తున్నట్టు అప్పటికే అందుబాటులోకి వచ్చిన వివరాలు వెల్లడించాయి. ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ వివరాలను తొలుత డీసీజీఐకి సమర్పించిన తర్వాతే పరిశోధనాత్మక జర్నల్స్‌లో నిపుణులు విశ్లేషణల కథనాలు ఉంటాయని ఇప్పటికే సంస్థ తెలిపింది.

కొవాగ్జిన్ టీకా‌ ట్రయల్ రిజల్ట్స్ లేకుండానే అత్యవసర వినియోగ అనుమతి పొందింది. ఈ కారణంగా విదేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాగ్జిన్ టీకాను ఆమోదించలేదు. ఫలితంగా కొవాగ్జిన్ తీసుకున్నవారు విదేశాలకు వెళ్లడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చడానికి భారత్ బయోటెక్ ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా సమర్పించిన మూడో దశ ఫలితాలను డీసీజీఐ ఆమోదిస్తే డబ్ల్యూహెచ్‌వో జాబితాలో కొవాగ్జిన్‌ను చేర్చడం సులవు అవుతుందని కంపెనీవర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story