పిల్లలపై కొవాగ్జిన్, జైడస్ టీకా ప్రయోగాలు

by Shamantha N |
పిల్లలపై కొవాగ్జిన్, జైడస్ టీకా ప్రయోగాలు
X

న్యూఢిల్లీ: థర్డ్ వేవ్‌తో పిల్లలకు ముప్పు ఉన్నదన్న నేపథ్యంలో వారి కోసం టీకా ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భారత్ బయోటెక్, గుజరాత్‌కు చెందిన జైదుస్ సంస్థలు పిల్లలపై టీకా ప్రయోగాలు ప్రారంభించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశానికి దాదాపు 25 కోట్ల డోసులు పిల్లల కోసం అవసరమవుతాయని అంచనా వేసింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతుల కోసం కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించిన వివరాలను భారత్ బయోటెక్ సమర్పించిందని వివరించింది. కాగా, ఫైజర్, మొడెర్నా సంస్థలు డిమాండ్ చేస్తున్న నష్టపరిహారం నుంచి రక్షణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దేశంలో టీకా పంపిణీ శరవేగంగా సాగుతున్నదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. సింగిల్ డోసు వేసిన దేశాల్లో భారత్ ముందంజలో ఉన్నదని వివరించారు.

అమెరికానూ దాటేసిందన్నారు. అవర్ వరల్డ్ డేటా ప్రకారం, అమెరికా 16.9 కోట్ల మందికి సింగిల్ డోసు వేసిందని, భారత్ 17.2 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిందని చెప్పారు. ఇందులో చైనా వివరాలు లేవు. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం సంతోషకరమైన విషయమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. కరోనా కేసులు పీక్ చేరిన మే 7నాటి వివరాలతో పోలిస్తే కేసులు 68శాతం తగ్గిపోయాయని వివరించారు. మే 10తో పోల్చితే యాక్టివ్ కేసులు 21 లక్షలు తగ్గిపోయాయని చెప్పారు. వీలైనంత తొందరగా వ్యాక్సి్న్ అందాలని, తద్వారా మూడో వేవ్‌ను నియంత్రించవచ్చునని తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టాయని కొవిడ్ ప్రొటోకాల్స్‌పై నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story