మోయలేని భారం.. ఎవరికీ బరువు కావొద్దని దంపతుల ఆత్మహత్య

by Sumithra |
మోయలేని భారం.. ఎవరికీ బరువు కావొద్దని దంపతుల ఆత్మహత్య
X

దిశ, పరిగి : కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. బయటపడేందుకు ఎన్నిమార్లు ప్రయత్నించినా ఇబ్బందులు తగ్గకపోగా, ఎక్కువ కావడంతో ఆ దంపతులు ఇద్దరూ ప్రాణాలను వదిలేశారు. ఎవరికీ భారం కాకూడదని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పూడూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. యాదయ్య (36), యాదమ్మ (32) దంపతులు. వీరు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. పంట వేసేందుకు పెట్టుబడి కోసం చేసిన అప్పలకు వడ్డీలు క్రమంగా పెరగడంతో జీవితంపై విరక్తి చెందారు. అప్పుల ఊబి నుంచి బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఏ దారి కనిపించకపోవడంతో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగిన వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించేలోపే మరణించినట్టు వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పాటిల్ తెలిపారు.

Advertisement

Next Story