- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుట్టగొడుగుల ఫార్మింగ్ @కోట్లు కొల్లగొడ్తున్న నిరుద్యోగి
‘పాండమిక్’ పరిమిత నిరాశను తీసుకొచ్చిన మాట వాస్తవమే. అందరూ దాని బాధితులే. కానీ భవిష్యత్తుపై అనంతమైన ఆశను కోల్పోని ధీరులు మాత్రమే భయంకరమైన పరిస్థితులకు ఎదురొడ్డి కొత్త దారుల్లో ప్రయత్నించి విజయం సాధించారు. ఆ వ్యక్తుల్నే ప్రపంచం ‘విజేత’లుగా, ఇన్‌స్పైరింగ్ పర్సన్స్‌గా గుర్తిస్తుంది. అందుకు నిదర్శనమే ఉత్తరాఖండ్‌కు చెందిన సతీందర్ రావత్. మహమ్మారి వల్ల ఉద్యోగం కోల్పోయిన అతడు, తన భార్యతో కలిసి ‘మష్రూమ్’ కల్టివేషన్ ప్రారంభించాడు. కఠిన సమయంలోనూ పట్టుదలతో ప్రయత్నించి.. ప్రస్తుతం రూ. రెండున్నర కోట్ల టర్నోవర్‌తో అంచెలంచెలుగా తన బిజినెస్ విస్తరిస్తున్నాడు. పుట్టగొడుగుల పెంపకంలో జీరో నాలెడ్జ్‌తో అద్భుతం సృష్టించిన అతడి విజయగాథ మీకోసం.
దిశ, ఫీచర్స్ : సతీందర్ సింగ్ రావత్ గల్ఫ్‌లో 15 ఏళ్లుగా రిటైల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశాడు. కానీ పాండమిక్ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో, అతడి లైఫ్ ఒక్కసారిగా తలకిందులైంది. భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. చేసేదేం లేక జూన్ 2020లో దుబాయి నుంచి నోయిడాకు వచ్చిన సతీందర్ కెరీర్‌ను నిర్మించుకునే పనిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను భార్య, స్నేహితులతో పంచుకున్నాడు. అయితే హార్టికల్చర్ చేస్తే ప్రతి రెండు నెలలకోసారి పువ్వులు కోతకు వస్తాయని, బిజినెస్ కూడా బాగుంటదని వాళ్లు సూచించారు. కానీ ఇది ఆర్థికంగా, వ్యాపారపరంగా కాస్త రిస్క్‌తో కూడిన పని కావడంతో సతీందర్ ‘బటన్ పుట్టగొడుగులు’ పెంచాలని డిసైడ్ అయ్యాడు. సెప్టెంబరులో లాక్‌డౌన్ సడలించడంతో నైనిటాల్, రామ్‌నగర్ గ్రామంలో 1.5 ఎకరాల భూమిని అద్దెకు తీసుకున్నాడు. జనవరిలో అక్కడే రెండు గుడిసెలు ఏర్పాటుచేసి కల్టివేషన్ ప్రారంభించాడు. అయితే, వాటిని పెంచడానికి ఏసీలతో ఆప్టిమమ్ టెంపరేచర్ ఏర్పాటు చేశాడు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పండించిన మొదటి పంటకు 6లక్షల రూపాయలు రాబడి రావడంతో సతీందర్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాడు.
జీరో నాలెడ్జ్‌తోనే సతీందర్, అతడి భార్య పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. అయితే ప్రారంభంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఓ ప్రొఫెషనల్‌ను నియమించుకుని, ప్రాథమికంగా పంటపై అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత ప్రొఫషనల్ మష్రూమ్ కల్టివేటర్‌తో కలిసి పనిచేయడంతో, పంటపై, వాటి పెంపకం మీద పూర్తిగా పట్టు సాధించారు. దాంతో తామే సొంతంగా పుట్టగొడుగు కంపోస్ట్ తయారు చేసి, మష్రూమ్స్ పెంచడం మొదలుపెట్టారు. కెమికల్స్ ఉపయోగించుకుండా తాము తయారుచేసిన పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి స్పందన రావడంతో, వెజిటెబుల్ వెండర్స్, క్యాటరర్స్, రెస్టారెంట్లు ఇతర వినియోగదారులకు విస్తృతంగా విక్రయించారు. దాంతో తమ అగ్రి స్టార్టప్‌కు ‘శ్రీహరి అగ్రోటెక్’ అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం 10మంది స్థానిక రైతులకు ఇందులో ఉద్యోగావకాశాలు కల్పించగా, 200 దుకాణాలకు తమ ప్రొడక్ట్స్(పుట్టగొడుగులు, కూరగాయాలు) అమ్ముతూ, దాదాపు రూ. 2 – 2.5 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు.
‘15ఏళ్లుగా నేను చేసిన పనిలోనే మరొక ఉద్యోగం చూసుకోవచ్చు. కాని ఒత్తిళ్లు షరా మామూలే. అంతేకాకుండా తక్కువ జీతాలతో జీవితాన్ని వెళ్లదీయాలి. అందుకే ఇకపై 9-5 ఉద్యోగ చట్రంలో చిక్కుకోవద్దని అనుకున్నాను. లైఫ్ సేవింగ్స్ మొత్తాన్ని వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశాను. నష్టాలు వస్తే రావచ్చు కానీ ప్రయత్నం వృథాగా పోదు. తప్పకుండా ఏదో ఒక రోజు ఇందులో విజయం సాధిస్తాననే నమ్మకంతోనే ఇందులో అడుగేశాను. అనుకున్నట్లుగానే ఆరు నెలలు కష్టమైనా, ఆ తర్వాత మష్రూమ్ పెంపకం, మార్కెట్ తీరుపై ఓ అవగాహన రావడంతో ఇండిపెండెంట్‌గా మార్కెటింగ్ చేయడం నేర్చుకున్నాను. అమ్మకాలలో 50% పైగా లాభాలు రావడంతో, ప్రతి నెలా 2.5 లక్షల రాబడి సాధిస్తున్నాం. తొలిగా బటన్ పుట్టుగొడుగులను మాత్రమే పెంచాం, ఆ తర్వాత స్థానిక మార్కెట్లో డిమాండ్ ఉన్న ఓస్టర్ రకాన్ని కూడా పెంచడంతో మరింత ఆదాయం పెరిగింది. రైతు మార్కెట్‌తో పాటు, పంటకు అనువైన నేలను గుర్తించగలిగితే తక్కువ భూమి నుంచే ఎక్కువ డబ్బు సంపాదించగలడు. దానివల్ల రైతు మెగా పంటలపై ఆధారపడాల్సిన అవసరం లేదు
– సతీందర్ రావత్
‘రెండు గుడిసెల్లో దాదాపు 70టన్నుల ఉత్పత్తి సాధించొచ్చు. ఒక్కో గుడిసె 20 × 50 అడుగులతో, 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మౌలిక సదుపాయాలు, ఎయిర్ కండీషనర్లతో రూ .1.5 లక్షలు ఖర్చవుతాయి. దీంతో ఆరు సంవత్సరాల వరకు ఇన్‌ఫ్రస్ట్రక్చర్ కోసం అదనంగా ఖర్చుచేయాల్సిన అవసరం రాదు. పంట వేసిన ఫస్ట్ సైకిల్‌లోనే పెట్టుబడి వ్యయం వచ్చేయగా, మిగిలిన ఉత్పత్తి లాభాన్ని తీసుకొస్తుంది. ఎయిర్ కండిషనింగ్ పుట్టగొడుగులు ఏడాది పొడవునా మంచిగా పెరగడానికి దోహదపడుతుంది. ఆరు నెలల్లో 70 టన్నులు ఉత్పత్తి చేస్తే 40 లక్షలకు పైగా సంపాదించొచ్చు. ఇక కూరగాయలను కూడా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాం. మానవులకు, ప్రకృతికి సహాయపడే సేంద్రీయ ఉత్పత్తుల కోసం అన్వేషిస్తున్నాం. సంప్రదాయ పంటలైన తృణధాన్యాలు, గోధుమలు, చెరకు వంటి పంటలను పండించే రైతులకు ఆర్థికంగా సాధ్యమయ్యే నమూనాను ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో సంప్రదాయేతర వ్యవసాయాన్ని చేయడం వల్ల వారికి ఆర్థికంగా లాభదాయకమని ఇది రుజువు చేస్తుంది. ట్రెడిషనల్ ఫార్మింగ్‌కు మించి ఆలోచించేలా చేస్తుంది.
– సప్నా సతీందర్
ఇమ్యూనిటీ బూస్టర్స్..
సూర్యకాంతితో పనిలేకుండా పెరిగే మష్రూమ్స్ నిండా పోషకాలుంటాయి. ప్రోటీన్ ఫుడ్‌కు ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఇవి నిలుస్తాయి. పుట్టగొడుగుల్లో పొటాషియం, రాగి, సెలీనియం, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. వీటిలో డి విటమిన్ కూడా అధికంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేయడంతో పాటు, నిత్యయవ్వనంగా ఉంచడంలోనూ ఇవి తోడ్పడుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు పుట్టగొడుగులను రెగ్యులర్ ఫుడ్‌లా తినాలని సూచిస్తున్నారు.
సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ :
‘మష్రూమ్ కల్టీవేషన్’ ఒక కుటీర పరిశ్రమగా కూడా ఉపయోగపడుతుంది. ప్రజలు ఇళ్లలోనే తక్కువ స్థలంలో, అతి తక్కువ పెట్టుబడితో వీటిని పెంచవచ్చు. అంతేకాదు ఈ పెంపకానికి సంబంధించిన టెక్నిక్స్ ఒక్కరోజులోనే నేర్చుకోవచ్చు. వీటి సాగుకు భూమి అవసరం కూడా ఉండదు. చిన్న గదిలో సంచుల్లోనే వీటిని పెంచవచ్చు. కలప లేదా ఇనుప స్టాండ్‌లో వేలాడదీయడం ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ సంచులను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు దీనికోసం రోజంతా సమయం కేటాయించనవసరం లేదు. ఒక సాధారణ వ్యక్తి ఇంటి వద్ద వీటిని పెంచడం ద్వారా 10,000 నుండి 12,000 వరకు సంపాదించే అవకాశముందని మార్కెట్ రీసెర్చర్స్ అభిప్రాయపడుతున్నారు. కిలో ఉత్పత్తికి దాదాపు 300 లాభం పొందే అవకాశముంది. ఇంట్లోనే 500 కిలోల పుట్టగొడుగులను సులభంగా ఉత్పత్తి చేయవచ్చని వారంటున్నారు.