రేపే కౌంటింగ్‌.. అధికారులు సమాయత్తం.. లెక్కింపు ప్రక్రియ ఇలా..

by Sridhar Babu |   ( Updated:2021-12-13 02:00:25.0  )
రేపే కౌంటింగ్‌.. అధికారులు సమాయత్తం.. లెక్కింపు ప్రక్రియ ఇలా..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మంగళవారం ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియలో సాయంత్రంలోగా విజేతలు ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నేతలు ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగు పెట్టేందుకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇద్దరికి ఓట్లు వేయాల్సి ఉంటుంది.

జిల్లాలో 1,324 ఓట్లకు 1,320 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా 1, 2 నెంబర్లు వేసి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నికోవాల్సి ఉంది. 1,320 ఓట్లలో 440 ఓట్లు అంటే మూడో వంతు ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు తేలనట్లయితే రెండో ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల ఫలితాలను వెలువరించేందుకు రెండు రోజుల సమయం అవుతుందని భావిస్తున్నప్పటికీ 1,320 ఓట్లు మాత్రమే కావడంతో మంగళవారం సాయంత్రంలోగా అభ్యర్థుల భవితవ్యం తేలనుందని అంచనా వేస్తున్నారు.

8 టేబుళ్లు.. ఏడు రౌండ్లు..

ఉదయం 7.30 గంటలకు స్ట్రాంగ్ రూం నుండి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. 8 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి అన్ని బ్యాలెట్ పేపర్లను కలుపుతారు. ఆ తరువాత 25 బ్యాలెట్ పేపర్లతో ఒక్కో కట్టను తయారు చేస్తారు. 8 టేబుళ్లలో ఆరు రౌండ్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తరువాత ఏడో రౌండ్లో 5 టేబుళ్లలో లెక్కిస్తారు. మొత్తం 1320 ఓట్లలో మొదట ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తారు. ఒకటింట మూడో వంతు అంటే 440 ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. లేనట్టయితే రెండో ప్రయారిటీ లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed