చిట్యాలలోనే పత్తి కొనుగోలు చేయాలి: రైతులు

by Sridhar Babu |   ( Updated:2021-11-11 02:51:15.0  )
wgl-market1
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్ కు స్వయంప్రతిపత్తి దక్కిన అలంకారప్రాయంగా మిగులుతోంది. మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కొంతమంది రైతులు దళారులకు పత్తిని అమ్ముకుంటూ ఉండగా మరికొంతమంది వరంగల్- జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు ట్రాలీల ద్వారా పత్తి బస్తాలను తరలించడానికి ఒక బస్తాకి రూ.70 చొప్పున ఖర్చు అవుతుందని వాపోతున్నారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తే రవాణా ఖర్చులు మిగులుబాటు కావడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. కాగా, గతంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు చేసేవారు. వ్యాపారులు లైసెన్స్ లను రెన్యువల్ చేసుకోకపోవడం, సీసీఐ నేరుగా జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అప్పటి నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ రోజు రోజుకు అలంకారప్రాయంగా మిగులుతోంది. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మార్కెట్ లో కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోళ్లలో దళారులదే రాజ్యం

చిట్యాల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఉన్న పత్తిని అమ్ముకోవడానికి అవకాశాలు లేకపోవడంతో దళారులు రాజ్యమేలుతున్నారు. తేమ శాతం సాకుగా చూపి ధర తగ్గించి, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దళారులకు కాకుండా జిన్నింగ్ మిల్లులకు వెళ్తే అక్కడ డబ్బులు ఆలస్యంగా ఇస్తున్నారు. మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతోపాటు రైతులకు మేలు చేకూరుతుంది. కానీ మార్కెట్‌యార్డ్ అధికారులు చొరవచూపడం లేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు వరంగల్, పరకాల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి.

దర్శనమిస్తున్న పిచ్చి మొక్కలు

చిట్యాల వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్ కు స్వయంప్రతిపత్తి దక్కినా పాలకవర్గం ఏర్పాటు కాలేదు. దీంతో మార్కెట్ యార్డ్ ను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. దీనివల్ల మార్కెట్ యార్డు రోజురోజుకు అలంకారప్రాయంగా మిగులుతోంది. దీంతో మార్కెట్ పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి దర్శనమిస్తున్నాయి. నూతన పాలకవర్గం ఏర్పాటు చేసి మార్కెట్ ను అభివృద్ధిలోకి తెస్తే ఇక్కడి ప్రాంత రైతులకు మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నా ఆ వైపుగా అడుగులు పడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఆ దిశగా చర్యలను ముమ్మరం చేయాలని రైతులు కోరుతున్నారు.

రవాణా ఖర్చులే అధికం అవుతున్నాయి: చింతల రజినీకాంత్, కైలాపూర్ రైతు

చిట్యాల మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు జరిపితే రైతులకు మేలు జరుగుతది. గతంలో ఇక్కడ పత్తి కొనుగోళ్లు జరిగేవి. అప్పట్లో ఎడ్లబండ్లలో పత్తి బస్తాలను తీసుకువెళ్లి అమ్ముకునే వాళ్లం. కొన్ని సంవత్సరాలుగా కొనుగోళ్లు జరగకపోవడం వల్ల వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలి.

Advertisement

Next Story