అవినీతికి అడ్డాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

by Shyam |
అవినీతికి అడ్డాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ప్రతీ పనికో రేటు నిర్ణయించి చేతివాటం ప్రదర్శించడం సిబ్బందికి అలవాటైపోయింది. అమామ్యాలు ముట్టజెప్పకపోతే గంటలో కావాల్సిన పనికి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని జులుం ప్రదర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రెవెన్యూ శాఖలో అవినీతి హెచ్చుమీరిందని భావించిన ప్రభుత్వం ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దుచేశారు. అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ల అధికారాల్లో కొన్ని తహసీల్దార్లకు తర్జుమా చేసింది. తహసీల్దార్లకు ఉన్న సర్వాధికారాల్లో కొన్నింటికి కత్తెర వేస్తూ ఆర్డీఓలకు అప్పగించింది. అయినా ఈ శాఖల్లో అవినీతి అంతం కాకపోగా, లంచాల కోసం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ప్రతి పనికీ ఓ రేటు..

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు మార్కెట్‌ వాల్యుపైన సేల్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 4శాతం, ట్రాన్స్ ఫర్‌ డ్యూటీ సుంకం 1.5శాతం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 0.5చొప్పున మొత్తం 6శాతం చార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 1శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.5శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5చొప్పున కనీసం రూ.1000, గరిష్టంగా రూ.10వేలు చెల్లించాలి. పై చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉండగా ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.1000వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనల మేరకు లొసుగులు ఉన్న పక్షంలో కనీసం రూ.3వేల నుంచి గరిష్టంగా రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

మ్యూటేషన్‌కు అదనపు బాదుడు..

ధరణికి ముందు భూమి బేరం కుదిరాక రిజిస్ట్రేషన్ స్టాంపు రుసుం, చలనాల రూపంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చెల్లించాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్ అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో 1బీ రికార్డుల్లో యాజమాన్య హక్కుల మార్పిడి(మ్యుటేషన్) కి ఉచిత సేవలందించే వారు, పాసు పుస్తకం లేని రైతులకు కొత్త పుస్తకం జారీకి నామామాత్రంగా వసూలు చేసేవారు. ధరణి పోర్టల్ ద్వారా అమల్లోకి వచ్చిన సేవల్లో రిజిస్ట్రేషన్ చలానా ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవు. మ్యుటేషన్ మాత్రం ఎకరాకు రూ.2500 నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రయవిక్రయాలు, బహుమతి, తాకట్టు, భూ హక్కుల బదిలీ, వారసత్వ పంపిణీ తదితర లావాదేవీల సందర్భంగా మ్యుటేషన్ కు ఈ చార్జీని వసూలు చేస్తారు. కానీ గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ రశీదు చేల్లిస్తే రిజిస్ట్రేషన్లు జరిగేవి. నూతన విధానంలో ప్రాపర్టీ ట్యాక్స్ తో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఒకవేళ ఇటువంటి రిజిస్ట్రేషన్లు చేయాలంటే. వారు అడిగినంత ముట్ట జెప్పుకోవాల్సి వస్తోందని సికింద్రాబాద్ కు చెందిన మురళీ కృష్ట వాపోతున్నాడు.

ఈసీల కోసం భారీ వసూళ్లు..

ఈసీ జారీ చేసేందుకు 1983నుంచి ఇప్పటి వరకు చార్జీలు రూ.220, అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి ఈసీ జారీ చేసేందుకు రూ.520 చార్జీలు చెల్లించాలి. అయితే అక్కడ అదనంగా మరో రూ.200 అక్రమంగా వసూలు చేస్తున్నారు. అలాగే ధ్రువీకరించిన నకలు కాపీలు జారీ చేసేందుకు ప్రభుత్వపరంగా చార్జీలు 1983నుంచి ఇప్పటి వరకు రూ.220, అంతకు ముందుది కావాలంటే రూ.520 చెల్లించాలి. అయితే ఇక్కడ అదనంగా రూ.300వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థిరాస్తి విలువ నిర్ధారణ పత్రం (మార్కెట్‌ వాల్యు సర్టిఫికేట్‌) జారీకి అధికారికంగా రూ.10 చెల్లించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం రూ.200 వసూలు చేస్తున్నారు. పెళ్లి రిజిస్ట్రేషన్లకు రూ.250చార్జీలు ఉండగా, రూ.500 వసూలు చేస్తున్నారు. అందులో లొసుగులు ఉంటే రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నార్త్ జోన్ లోని ఓ కార్యాలయంలో ఈసీల జారీలో వసూళ్ల దందా కొనసాగుతుందని పలువరు వాపోతున్నారు. ఈసీల కోసం ఇద్దరు వ్యక్తులను ప్రత్యేకంగా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ కూడా కేవలం నామామాత్రంగానే విధులు నిర్వహిస్తూ.. మిగతా పనులన్నీ ఆ ఇద్దరే చక్కబెడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

పేరుకే సిటిజన్‌ చార్టర్‌..

సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం గోడలకు సిటిజన్‌ చార్టు బోర్డులు అతికించారు. అందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటించకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయి. సిటిజన్‌ చార్టర్‌ లో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొన్నారు. భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు గరిష్టంగా 24గంటల సమయం పడుతుండగా, కంప్యూటరైజ్డ్‌ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీకి గంట, అలాగే ఈసీ నకలు మ్యానువల్‌గా ఇచ్చేందుకు 24గంటలు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు గంట, పెండింగ్‌ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒక రోజు, భూముల మార్కెట్‌ వాల్యువేషన్‌ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటిజన్‌ చార్టులో పేర్కొన్నారు. అయితే ఇవ్వన్ని నామమాత్రమే. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed