పదవొకరిది.. సోకొకరిది.. జీహెచ్‌ఎంసీలో విచిత్ర పరిస్థితి

by Shyam |   ( Updated:2021-06-30 02:10:06.0  )
corporators husbands ruling authority in ghmc
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికైన మహిళా కార్పొరేటర్ల స్థానంలో వారి భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. బస్తీలలో పర్యటించడం, అధికారులతో మాట్లాడడం, కొత్త పనుల ప్రారంభోత్సవం, డివిజన్లలో కొనసాగుతున్న పలు రకాల మరమ్మత్తు పనుల తనిఖీలు, నూతన పనుల కోసం ఆర్జీలు.. ఇలా ఒక్కటేమిటి అన్నింటిలోనూ భర్తలదే పెత్తనం.

‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ రిజర్వేషన్లపై మహిళలు చేసిన రణనినాదానికి వారు వ్యవహరిస్తున్న తీరు కొత్త అర్ధాలు చెప్పినట్లవుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు.. చట్ట సభల్లోనూ 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని పోరాటాలు చేశారు. రిజర్వేషన్‌ కల్పిస్తే పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. గ్రేటర్ పరిధిలోని అనేక డివిజన్లలో మహిళా కార్పొరేటర్లు భర్త చాటు భార్యలుగానే మిగిలిపోతుండగా.. ప్రజా ప్రతినిధులమన్న విషయమే మరచిపోయినట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. డివిజన్ కు సంబంధించి ఏ విషయంలోనూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు.

కొందరు తప్పనిసరైతే తప్ప ఇంటి గడప దాటడం లేదు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. మొత్తం 150 డివిజన్లలో 75 స్థానాలు వారికే కేటాయించారు. ఇవే కాకుండా దేదీప్యారావు (వెంగళరావునగర్), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), సబితా కిషోర్ (వెంకటాపురం), గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్) డివిజన్లలో అన్ రిజర్వ్ డ్ సీట్లలో విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో వారి సంఖ్య 79కి చేరింది. తాజాగా పురుష కార్పొరేటర్ల కంటే మెజార్టీ వారిదే. ఇది చెప్పుకునేందుకు మాత్రమే. పేరుకే వారు కార్పొరేటర్లు.. పెత్తన మంతా భర్తలదే.

పెత్తనమంతా భర్తలదే..

గోషామహల్ నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో బీజేపీ మహిళా కార్పొరేటర్లు విజయం సాధించారు. అయితే డివిజన్లలో మాత్రం వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారు. తరచూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, వేర్వేరు విభాగాల అధికారులతో మాట్లాడడం, అభివృద్ధి పనులు, పౌర సమస్యల పరిష్కారం.. ఇవేకాకుండా అన్ని విషయాలలో వారు జోక్యం చేసుకుంటున్నారు. చివరకు మీడియాకు రిలీజ్ చేసే ప్రెస్ నోట్లలో కూడా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తల ఫోటోలే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితే నగరంలో మహిళా కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న చాలా డివిజన్లలో నిత్యకృత్యమైంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నా ..వారు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story