కరోనాను ఇలా ఎదుర్కొంటాం: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

by srinivas |
కరోనాను ఇలా ఎదుర్కొంటాం: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో భయాలు ప్రచారం చేయవద్దని చెప్పారు. వదంతుల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనాను నిరోధించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని ఆయన తెలిపారు. మరో 14 రోజుల తరువాత మళ్లీ అతనికి పరీక్షలు నిర్వహిస్తామని, ఆ తరువాతే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆయన వెల్లడించారు. కరోనా నుంచి రక్షణకు వినియోగించే మాస్క్‌లు,శానిటైజర్ల కొరత రానివ్వమని ఆయన తెలిపారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 840 మంది ప్రయాణికుల్ని గుర్తించామని, వారిలో 560 మంది వారి వారిఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. మరో 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని వారు సురక్షితమేనని పేర్కొన్నారు. మిగిలిన 30 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని ఆయన వెల్లడించారు.

రాష్ట్రం నుంచి 92 మంది కరోనా అనుమానితుల నమూనాలను ల్యాబ్ కు పంపగా 75 మందికి నెగిటివ్ వచ్చిందని, 16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని ఆయన తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని, అనుమానితులకు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లలోనే ఉండడం మంచిదని ఆయన సూచించారు.

ఈ చర్యలతో పాటు కరోనా వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంటువ్యాధుల చట్టం-1897ను అమలు చేయనున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులకు మరిన్ని అధికారాలు కల్పించామని ఆయన వెల్లడించారు. దీంతో కరోనా అనుమానితులు వైద్యానికి నిరాకరిస్తే నిర్బంధ వైద్యం అమలవుతుందని ఆయన చెప్పారు. కరోనా బాధితులు, లేదా అనుమానితుల గురించిన సమాచారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని చెప్పారు. అనుమానితులెవరైనా కనిపిస్తే 0866-2410978 ఫోన్ నెంబర్‌కి సమాచారం అందించవచ్చని తెలిపారు. అలాగే సమాచారం లేదా వైద్య సలహా కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని ఆయన ప్రకటించారు.

tags : ap, carona, ks jawahar lal, health department, carona bulletin,

Advertisement

Next Story

Most Viewed