గేట్లు ఎత్తగానే గేరు పెంచిందా?

by Shamantha N |
గేట్లు ఎత్తగానే గేరు పెంచిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: మాయదారి వైరస్ రూట్ మార్చిందా… గేట్లు ఎత్తగానే గేరు పెంచిందా.. పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోందా? లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులు, వలస కార్మికుల తరలింపు, నిబంధనల ఉల్లంఘనలతో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోందా? అంటే నాలుగైదు రోజులుగా రిపోర్ట్ అవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే అవుననే అనిపిస్తున్నది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, బీహార్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ రాష్ట్రాల్లో రోజురోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. దీనిపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు కరోనా కేసులు దాదాపుగా నగరాల్లోనే వెలుగు చూశాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని మొత్తం కేసుల్లో సగానికి కంటే ఎక్కువ వాటి రాజధానుల్లో(వరుసగా ముంబై, చెన్నై, కోల్‌కతా)నే నమోదయ్యాయి. నాలుగో దశ లాక్‌డౌన్ మరిన్ని సడలింపులతో రానున్నట్టు తెలుస్తున్నది. ట్రైన్ సేవలు పున:ప్రారంభ కావడంతోనూ ఈ భయాలు పెరుగుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో చాలా కేసులు ఇండోర్ నగరానికే పరిమితమయ్యాయి. కానీ, మే 1 తర్వాత ఈ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది జిల్లాలో కరోనా కేసులు వెలుగు చూశాయి. నీమచ్‌లో 27 కేసులు, అనుప్పూర్‌లో 3, సత్నాలో 5, భీండ్‌లో 4, గునాలో 1, జాబువాలో 2, పన్నాలో 1, సెహోర్‌లో 4, సియోనిలో 1, మాండ్లలో 1, సిధిలో 1 చొప్పున నమోదయ్యాయి. ఇవన్నీ రూరల్ ఏరియాలోని జిల్లాలే కావడం గమనార్హం. రాజస్తాన్‌‌ సరిహద్దులోని మధ్యప్రదేశ్ జిల్లా నీమచ్‌లో ఓ పెళ్లి తర్వాత కేసులు పెరిగాయి. బీహార్‌లో 65 శాతం పాజిటివ్ కేసులు రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లోనే నమోదయ్యాయి. మే మొదటి వారం వరకు 766 కేసుల్లో 410 ఇలాంటి చోట్లలోనే వెలుగు చూశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్‌కు వచ్చి కరోనా పాజిటివ్ తేలిన వలస కార్మికుల సంఖ్య గత మూడు రోజుల్లో ఏడు నుంచి 23కి పెరగడం గమనార్హం. మరో 2.1 లక్షల మంది వలస కార్మికులు బెంగాల్‌కు తిరిగి వచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం. రాజస్తాన్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తున్నది. ఇటీవలే కరోనా మహమ్మారి రూరల్ జిల్లాలైనా జాలోర్, సిరోహిలకు పాకింది. ఈ జిల్లాల్లో 35 కేసులు ఈ మధ్యే వెలుగు చూశాయి. లక్షల మంది వలస కార్మికులు స్వరాష్ట్రానికి తరలివస్తుండగా ఈ మహమ్మారిని పల్లెకు వ్యాపించకుండా అడ్డుకోవడం పెద్ద సవాల్‌గానే పరిణమిస్తున్నదని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. జార్ఖండ్‌లోనూ ఇటీవల దాదాపు 75 శాతం కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. గత 12 రోజుల్లో ఈ రాష్ట్రంలో నమోదైన 50 కేసుల్లో 38 కేసులు రూరల్ బెల్ట్‌లోనే రిపోర్ట్ అయ్యాయి.
నిజానికి కరోనా కేసులు నగరాల్లో రిపోర్ట్ అయితే.. అక్కడ వైద్య సదుపాయాలు తగిన స్థాయిల్లో అందుబాటులో ఉంటాయి. తక్కువ విస్తీర్ణం గల పట్టణాలైతే ఆ ఏరియాలో కఠిన ఆంక్షలు అమలు చేసి వైరస్‌ను కట్టడి చేయడం సులువవుతుంది. కానీ, ఈ వైరస్ పల్లెలకు విస్తరిస్తే మాత్రం దాని నియత్రించడం కష్టతరమవుతుంది. పల్లెల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండవు. ఆంక్షలు అమలు చేయడమూ అక్కడ అంత సులభంకాదు. అదీగాక, కాలానికి అనుగుణంగా కూలీలతో పంటలు సాగు చేయాల్సి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో కూలీలు భౌతిక దూరం పాటించడం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో పల్లెల్లో వైరస్ నియంత్రణ చర్యలు అమలు చేయడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతుంది.

Advertisement

Next Story