కరోనా మరణమృదంగం.. 1.26 లక్షలు దాటిన మృతులు

by Shyam |
కరోనా మరణమృదంగం.. 1.26 లక్షలు దాటిన మృతులు
X

వాషింగ్టన్ : కరోనా.. కరోనా.. కరోనా..! కొన్నేండ్ల తర్వాత కూడా 2020 అంటే మనకు ఈ పదం తప్ప మరేదీ గుర్తుకురాకపోవచ్చు. అంతలా కుదిపేస్తున్నదా వైరస్. కొత్త ఏడాదిలోకి అడుగెట్టినామో లేదో ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టింది. చైనాలో ప్రాణంపోసుకుని ప్రపంచదేశాలను కబళిస్తున్నది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచమంతా చుట్టేసి మళ్లీ చైనాలో తిరగబెడుతున్నది. కంటికి కనిపించని ఈ మహమ్మారి బారిన పడి కళ్ల ముందే ప్రాణాలు వదులుతున్నారు. లాక్‌డౌన్ పేరిట ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించగలిగాయి. కానీ, ఆ వైరస్ బారిన పడిన వారికి ఏం చికిత్స చేయాలో ఇంకా ఎటూ తేల్చేకోలేక పోతున్నాయి. చనిపోతారనుకున్న వృద్ధులు కోలుకుంటుంటే.. ఆరోగ్యవంతమైన యువకులు గంటల్లో విగతజీవులుగా మారిపోతున్నారు. కరోనా సృష్టించిన విలయతాండవానికి ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు 1.26లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కరోనా బారిన పడిన వారి సంఖ్య 20 లక్షలు దాటిపోవడంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.

చైనా తర్వాత కరోనా బారిన పడి అతలాకుతలమైన స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో గత రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. అంతే కాకుండా మరణాలు తగ్గడం.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్లు కోలుకుంటుండటం ఊరటనిచ్చే అంశం. అమెరికా ఆలస్యంగా మేల్కొన్నా.. తమ పౌరులను రక్షించుకోవడానికి కొవిడ్-19ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచడమే కాకుండా.. నేరుగా వైట్‌హౌస్‌ నుంచి రాష్ట్రాలకు కరోనా రిలీఫ్ ఫండ్స్ అందిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 6.13 లక్షలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 25 వేల మంది కరోనా పాజిటివ్‌గా తేలడం అమెరికాలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో 2,129 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు సంభవించిన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అమెరికాకు కరోనా కేంద్రంగా భావించిన న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలతో పాటు మిషిగన్, లూసియానాలలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఊరట కలిగించే విషయమే. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 26,047 మంది మృత్యువాతపడ్డారు.

ఇన్నాళ్లూ కరోనా ఊసే పెద్దగా లేని రష్యాలో కోవిడ్-19కేసులు ఒక్క సారిగా పెరిగిపోతున్నాయి. చైనాతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన రష్యా.. జనవరి 1నే దేశ సరిహద్దులు మూసేసి చైనాతో రాకపోకలను నిషేధించింది. దీంతో మొదట్లో కరోనా పాజిటీవ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. కాని ఎప్పుడైతే యూరోప్ దేశాల్లో కరోనా తీవ్రంగా ప్రబలిందో అప్పటి నుంచి రష్యాలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోయింది. మంగళవారం ఒక్క రోజే రష్యాలో 2500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ మరణాల సంఖ్య 170కి చేరింది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పుతిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రష్యా వ్యాప్తంగా కరోనా పరీక్షలను పెంచడమే కాకుండా ఆసుపత్రుల్లో అవసరమైన సామాగ్రిని సమకూర్చుతోంది.

ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఉదయం 11 గంటల వరకు నమోదైన కరోనా వివరాలు:

కరోనా కేసులు : 20,00,231

మరణాలు : 1,26,758

రికవరీ : 4,84,781

యాక్టివ్ కేసులు : 13,89,171

సాధారణ పరిస్థితి : 13,37,568

విషమ పరిస్థితి : 51,603

tags: coronavirus, covid 19, across world, globe, cases, fatalities, surge

Advertisement

Next Story