తిరుమలలో పది మందికి కరోనా!

by Anukaran |
తిరుమలలో పది మందికి కరోనా!
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం రేపింది. సుదీర్ఘ విరామం తరువాత ఆంక్షల నడుమ, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ గత నెలలో దర్శనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకింది. దీంతో టీటీడీ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు. టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు.

వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించి, వారి కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలుంటే కొండమీదకి రావద్దని భక్తులను కోరారు. ఒక్కసారి కొండెక్కి విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వారం రోజులపాటు కొండపైనే ఉండి విధులు నిర్వర్తించేలా షిప్ట్ సిస్టమ్‌ను తీసుకొచ్చామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. గత నెల ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్ సోకిందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed