వారంలో 27 మందికి కరోనా!

by Shamantha N |
వారంలో 27 మందికి కరోనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : కోవిడ్-19 (కరోనా) వైరస్ భారత్‌లో కల్లోలాన్ని సృష్టిస్తున్నది. ఒక్క వారంలోనే 27 మందికి సోకి.. ఆందోళన కలిగిస్తున్నది. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమై వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది.

మన దేశంలో ఇప్పటివరకు మొత్తం 30 ఈ వైరస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో ముగ్గురు కేరళకు చెందిన పేషెంట్లు గతనెలలోనే కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, మిగతా 27 కేసులు మాత్రం ఈ వారంలోనే నమోదయ్యాయి.

ఇందులో ఇటీవలే యూరప్ వెళ్లి భారత్‌కు తిరిగొచ్చిన ఢిల్లీ వాసి ఉన్నారు. అలాగే, దుబాయి నుంచి బెంగుళూరు.. అటు నుంచి హైదరాబాద్‌కు చేరిన టెకీ కోవిడ్-19 వైరస్ బారిన పడ్డాడు. ఈ టెకీకి చికిత్స అందించిన నర్సుకు కూడా వైరస్ సోకింది. వీరితోపాటు హైదరాబాద్‌లోనే మరో మహిళా సాఫ్ట్‌వేర్‌కు వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. ఢిల్లీ పేషెంట్‌ నుంచి ఆగ్రాకు చెందిన ఆరుగురికి ఈ వైరస్ సోకింది. రాజస్తాన్ నుంచి యూపీలోని ఆగ్రాకు చేరిన 16 ఇటలీ పౌరులకు వైరస్ పాజిటివ్ అని తేలింది. కాగా, ఇటలీ టూరిస్టులతోపాటుగా ఉన్న కారుడ్రైవర్‌కూ వైరస్ అంటుకుంది. ఈ 27 మందిలో 16 మంది ఇటాలియన్లే ఉన్నారు.

వైరస్ వ్యాప్తి చెందడంపై ప్రజలు భయభ్రాంతులకు లోనుకావొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రతిఒక్కరు పరిశుభ్రతను పాటించాలని, వైరస్ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందరికి(అన్ని దేశస్తులకు, విదేశాల నుంచి తిరిగొస్తున్న భారతీయులకు కూడా) మెడికల్ స్క్రీనింగ్ చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.

కాగా, కోవిడ్-19 విజృంభిస్తే ఎదుర్కొనే సామర్థ్యం మనకు ఉన్నదా? అనే ప్రశ్నపై భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించి నియంత్రించడానికి, వ్యాప్తి వేగానికి సమాంతరంగా చికిత్స అందించే సామర్థ్యానికి మన దేశ ఆరోగ్య వ్యవస్థ వృద్ధి చెందలేదని తమిళనాడు వెళ్లూర్‌కు చెందిన ప్రసిద్ధ వైరాలజిస్ట్ డాక్టర్ జాకోబ్ జాన్ అన్నారు. వైరస్ వ్యాప్తి చెందినతర్వాత చికిత్స అందించడమే తప్ప వ్యాప్తిని నియంత్రించడంలో మన దేశ ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేదని తెలిపారు. మలేరియా, టైఫాయిడ్, కలరా లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా అరికట్టడంలో దేశం ఆశించిన విజయం సాధించలేదని వివరించారు.

tags : coronavirus, 28 confirmed, precautions, spread of flu

Advertisement

Next Story

Most Viewed