18 రాష్ట్రాల్లో కరోనా వేరియంట్లు.. మహారాష్ట్రలో అధికం

by Anukaran |
corona
X

న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు కరోనా వేరియంట్ల వ్యాప్తి కలవర పెడుతోంది. మొత్తం 18 రాష్ట్రాల్లో కరోనా వేరియంట్లు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం రాష్ట్రాలు, యూటీలు పంపిన 10787 శాంపిళ్లను పరీక్షించగా 736 యూకే వేరియంట్లు, 34 దక్షిణాఫ్రికా వేరియంట్లు, ఒక్క బ్రెజిలియన్ మ్యుటేషన్ కనిపించాయని వివరించింది. కానీ, కరోనా కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లతో సంబంధమేమీ లేదని, అందుకు ఆధారాల్లేవని వివరించింది. కేరళ నుంచి 2032 శాంపిళ్లను పరీక్షించగా 123 నమూనాల్లో ఎన్440కే వేరియంట్ కనిపించిందని పేర్కొంది. ఇదే వేరియంట్‌ను గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ గుర్తించామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పంపిన శాంపిల్స్‌లో 33శాతం నమూనాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టు తేలిందని, తెలంగాణ నుంచి వచ్చిన 104 శాంపిళ్లలో 53 కేసుల్లో ఈ వేరియంట్ కనిపించిందని వివరించింది.

మన దేశంలో కొత్తగా డబుల్ మ్యుటెంట్ వేరియంట్ వెలుగులోకి వచ్చినట్టు వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి సేకరించిన శాంపిళ్లలో ఈ వేరియంట్ కనిపించినట్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ నుంచి పోల్చగా మహారాష్ట్రలో ఈ484క్యూ, ఎల్452ఆర్ మ్యుటేషన్ల కేసులు పెరిగినట్టు తెలుస్తున్నదని కేంద్రం తెలిపింది. ఈ రెండు మ్యుటేషన్లు ఒకే శాంపిళ్లలో వెలుగుచూశాయి. వైరస్‌లలో మ్యుటేషన్లు సహజమే కానీ, డబుల్ మ్యుటేషన్ కనిపించడం ఆందోళనకర విషయంగానే నిపుణులు చూస్తున్నారు. రోగ నిరోధక శక్తి నుంచి వైరస్‌ తప్పించుకుని వేగంగా శరీరంలోకి చొచ్చుకు పోవడానికి ఈ మ్యుటేషన్లు వైరస్‌కు ఉపకరిస్తాయని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తెలిపారు. రెండు మ్యుటేషన్లు ఒకేదానిలో జరుగుతూ సరికొత్త లీనియేజ్‌కు దారి తీస్తోందేమోనని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త డబుల్ వేరియంట్‌పై టీకా పనిచేస్తుందా? లేదా? అనేది కనుక్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. ఈ మ్యుటేషన్‌లే కరోనా కేసుల పెరుగుదలకు కారణమని చెప్పడానికి ఆధారాల్లేవని, పెద్ద సంఖ్యలోనూ ఈ వేరియంట్లు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed