టెస్టులు పెంచండి.. వైద్యులకు ఆదేశాలు

by Shyam |
టెస్టులు పెంచండి..  వైద్యులకు ఆదేశాలు
X

దిశ, కూకట్​పల్లి: కేసులు విజృంభిస్తుంటే కోవిడ్​ పరీక్షలు తగ్గించిన వైద్య ఆరోగ్య శాఖ లాక్​డౌన్​ విధించిన తరువాత మళ్లి కోవిడ్​ పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు లాక్​డౌన్..​ బయటికి వస్తే పోలీసులు లాఠీలకు పని చెబుతారు.. మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, జనం ఇండ్లకే పరిమితం అవుతుండటంతో పరీక్షలు చేయించుకోవడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకు ఒక్కో యూపీహెచ్​సీకి 30 నుంచి 70 పరిక్షలు మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. ఈ మధ్య నిర్వహించిన జూమ్​ మీటింగ్​లో ఒక్కో యూపీహెచ్​సీలో 150 పరీక్షలు, బస్తీ దవాఖానాలలో 50 పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏప్రిల్​ 28 కన్నా ముందు ఒక్కో కేంద్రంలో వందకు పైగా పరీక్షలు నిర్వహిస్తుండగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలతో ఒక్కసారిగా పరీక్షలు తగ్గాయి.

కోవిడ్​ పరీక్షలు నిర్వహించడంలో మతలబు ఏంటి?

కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్న సమయంలో ఒక్కసారిగా పరీక్షలు తగ్గించిన వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వం లాక్​డౌన్​ విధించడంతో రోడ్లపై జన సంచారం తగ్గడం కారణంగా కరోనా కేసులు, మరణాలు తగ్గాయి. 28 రోజుల లాక్​డౌన్​ కాలం తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పడిన ఈ సమయంలో కోవిడ్​ పరీక్షలు పెంచడంలో మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో వందల పరీక్షలు నిర్వహించి తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని లెక్కలు చూపించి మాయ చేయడమే కాక మరేంటి అని అంటున్నారు.

విముఖత ప్రదర్శిస్తున్న జనం

ఫీవర్​ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్న వైద్య శాఖ, జీహెచ్​ఎంసీ సిబ్బంది.. జనాలకు లక్షణాలు ఉన్న వారు ఆరోగ్య కేంద్రానికి వచ్చి కోవిడ్​ పరిక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న జనం మాత్రం ససేమిరా అంటున్నారు. ఇంటి వద్ద ఉండి మందులు తీసుకుంటాం కాని పరిక్షలు చేయించుకోమని చెబుతున్నట్టు సమాచారం.

బస్తీ దవాఖానాలలో టెస్టులు ప్రారంభం అయ్యేనా?

కూకట్​పల్లి, మూసాపేట్​ జంట సర్కిళ్ల పరిధిలో ఒక పీహెచ్​సీ, 6 యూపీహెచ్​సీలు, 15 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. గతంలోను పిహెచ్​సీ, యూపీహెచ్​సీలతో పాటు బస్తీ దవాఖానలలోను కోవిడ్​ పరిక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారి చేయగా ఒకటి రెండు బస్తీ దవాఖానాలలో నామ మాత్రంగా పరిక్షలు ప్రారంభించి బంద్​ చేశారు. ఇప్పుడు తాజాగా యూపీహెచ్​సీలతో పాటు బస్తీ దవాఖానాలలో 50 పరిక్షలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను బస్తీ దవాఖాన డాక్టర్లు అమలు చేస్తారా… ? వేచి చూడాలి. 7 ఆరోగ్య కేంద్రాలలో ఒక్కోక్క కేంద్రంలో 150 చొప్పున 1050, 15 బస్తీ దవాఖానలలో 750 మొత్తం 1800 పరిక్షలు నిర్వహించాలి. ఇప్పడు జంట సర్కిళ్లలో 3 వందల నుంచి 350 వరకు పరిక్షలు మాత్రమే జరుగుతున్నాయి.

కోవిడ్​ పరీక్ష కేంద్రాల వద్ద జనం నిల్​… వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద ఫుల్​

కరోనా కేసులు తగ్గు ముఖం పడటంతో పాటు ప్రభుత్వం సూపర్​ స్ప్రెడర్​లకు కోవిడ్​ వ్యాక్సిన్​ ఇస్తుండటంతో సూపర్​ స్ప్రెడర్​ వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద జనం వేలాది సంఖ్యలో వ్యాక్సిన్​లు వేయించుకోవడానికి వస్తున్నారు. కూకట్​పల్లి, మూసాపేట్​ జంట సర్కిళ్లలో 5 చోట్ల వ్యాక్సిన్​ కేంద్రాలు ఏర్పాటు చేసి రోజు 9 వందల నుంచి వెయ్యి మందికి వ్యాక్సిన్​ వేస్తున్నారు. దానికి తోడు 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సిన్​ సెకండ్​ డోస్​ వేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్​ వేయించుకోవడానికి మాత్రమే ప్రజలు ముందుకు వస్తున్నారు.

Advertisement

Next Story