పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు

by Shyam |
పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు
X

దిశ, వరంగల్: ఇక నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపి‌డ్ యాంటిజెంట్ కీట్స్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వరంగల్ అర్బన్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కిట్లు మంజూరు చేయగా అందులో 1336 కిట్లు జిల్లాకు అందజేయడంతో వాటిని పీహెచ్‌సీ‌లకు పంపించినట్టు చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు ల్యాబ్ టెక్నీషియన్‌లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఒక్కో కిట్టుతో ఒక్కరికీ పరీక్ష జరిపి 15 నుంచి 30 నిముషాల్లోపు ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఈ పరీక్షలు ముక్కు నుంచి తీసిన నమూనా ద్వారా ఫలితాలు త్వరగా రావడంతో వారికి చికిత్సతో పాటుగా ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి రావడం అవసరం లేదని, స్థానిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా క్యాన్సర్, గుండె, డయాలిసిస్ జబ్బులు కలిగి ఉండి జలుబు, జ్వరం శ్వాస సంబంధిత వ్యాధులతో భాధపడుతున్న వారితో పాటు, పాజిటివ్ కేసుకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ వాళ్లకు, హై రిస్కులో ఉన్న ఆరోగ్య సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తారని ఆమె చెప్పారు. ఈరోజు పైడి‌పల్లి పట్టణ హెల్త్ సెంటర్‌లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా పరీక్షలు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 20 మందికి పరీక్షలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 105 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed