- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లను కలిసింది ఎంతమంది?
కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియన్లను వ్యక్తిగతంగా కలిసింది ఎంతమందనే విషయంపై కరీంనగర్ జిల్లా పోలీసు యంత్రాంగం లోతుగా ఆరా తీస్తోంది. మార్చి 14 కరీంనగర్‌కు వచ్చిన మత ప్రచారకులు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరెవరిని కలిశారు? వారితో సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు ఎవరు అన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయింది. ఇప్పటికే 80 మంది వరకు గుర్తించామని జిల్లా పోలీసులు చెప్తుండగా ఇంకెంత మందిని కలిశారన్నది అంతుచిక్కకుండా తయారైంది. మత ప్రచారం కాబట్టి వారిని అతి దగ్గరకు వెళ్లి కలిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న అధికారులు వివిధ రకాలుగా విచారణ చేపట్టారు. ఇప్పటికే కొంతమందిని ఐసోలేషన్‌కు తరలించగా వీరిలో ఒకరకి కరోనా పాజిటివ్ రావడంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నగరంలోని కొన్ని ఏరియాలను గుర్తించిన అదికారులు ఆయా ప్రాంతాల్లోని జనం బయటకు రాకుండా రహదారులు మూసివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసిన తరువాత కలెక్టర్ శశాంక మీడియాతో మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి నిత్యవసరాలను పంపించేందుకు కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్ప బయటకు రావద్దని, వచ్చినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇండోనేషియన్లను కలిసినవారిలో కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఉండడంతో వారిని కూడా ఐసోలేషన్ కు పంపించారు. కానీ ఇంకా ఎంతమంది కలిశారన్న విషయంపై స్పష్టత రానట్టు తెలుస్తోంది. వారిని కలిసిన వారందరినీ గుర్తించినట్టయితే మొత్తం మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయిస్తే పాజిటివా, నెగిటివా అన్నది తేలుతుంది. కొంతమంది ప్రభుత్వ యంత్రాంగానికి సహాయనిరాకరణ చేస్తుండడంతో ఉన్నతాధికారులే రంగంలోకి దిగాల్సి వచ్చింది. కీలకమైన ప్రభుత్వ శాఖలన్నీ కరోనా కట్టడిపైనే నజర్ వేయడంతో జిల్లాలో పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. అయితే అనూహ్యంగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం అతను కూడా ఇండోనేషియా మత ప్రచారకులతో కలిసి తిరగడంతో అలర్ట్ కావల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాలి. వీఐపీల రాకపోకల సమయం మినహాయిస్తే పోలీసు పహారా అనేది కరీంనగర్‌లో అత్యంత అరుదేనని చెప్పాలి. దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసుల గస్తీ తీవ్రంగా ఉండేది. ఆ తరువాత నగరమంతా ఖాకీలమయం అయింది కరోనా కారణంగానే అని చెప్పాలి. అనుమానితులు సంచరించిన ప్రాంతాల్లోని వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని, వారు ససేమిరా అనడంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేయకతప్పలేదని స్పష్టం అవుతోంది.
ఆ కాలనీలన్ని సీజ్..
మహమ్మరి కరోనా వ్యాధిని పట్టుకుని వచ్చిన ఇండోనేషియన్లు ఉన్న కాలనీలన్నీ దిగ్బంధం చేశారు అధికారులు. ఆ కాలనీ రహదారులను మూసివేయడమే కాకుండా ఆ ప్రాంతానికి వేరే వ్యక్తులు వెళ్లవద్దని, ఆ ప్రాంతానికి చెందినవారు బయటకు రావద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాలు కూడా పంపిచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఆయా కాలనీలవాసులకు నిత్యవసరాలను సరఫరా చేసేందుకు పర్యవేక్షించనున్నారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడ ఉన్నా వారిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించి టెస్ట్‌లు చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కరోజే 20 మంది
కరీంనగర్‌లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని తరలించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. కరీంనగర్‌వాసికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తం అయిన అధికారులు వెంటనే అనుమానితులపై ఆరా తీసే పనిలో నిమగ్రమయ్యారు. ఒక్క సోమవారం నాడే దాదాపు 20 మంది అనుమానితులను పోలీసుల సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అనుమానితులను తరలించేందుకు ప్రత్యేకంగా కొన్ని టీంలను ఏర్పాటు చేశారు. దీంతో నిన్నటివరకు భయం భయంగా జీవించిన కరీంనగర్ వాసుల్లో కొంత ధైర్యం నూరిపోసినట్టయింది. మరో వైపున విదేశీ మత ప్రచారకులను కలిసినవారిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారి స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు. వీరిలో కొంతమందిని ఇప్పటికే క్వారంటైన్ కు తరలించగా మరికొంతమంది శాంపిల్స్ పరీక్షల నిమిత్త పంపించారు. కొంతమంది ప్రభుత్వ అధికారులైతే తాము ఇండోనేషియా మత ప్రచారకులను కలవలేదని భీష్మించుకుని కూర్చోగా జిల్లా స్థాయి అధికారి ఒకరు మందలించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వీరు మత ప్రచారకులను కలిసిన తరువాత ఎంతమందిని కలిశారు అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.