భయపడొద్దు.. ధైర్యం, వైద్యం కాపాడతాయి: కరోనా విజయుడు

by srinivas |   ( Updated:2020-04-04 05:04:20.0  )
భయపడొద్దు.. ధైర్యం, వైద్యం కాపాడతాయి: కరోనా విజయుడు
X

దేశంలో 3 వేల మందికి పైగా కరోనా బారిన పడితే, రెండు తెలుగు రాష్ట్రల్లో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో కరోనా నుంచి కోలుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు కరోనా నుంచి కోలుకునేందుకు ఏం కావాలో.. ఏం చేస్తే కరోనాను ధైర్యంగా ఎదుర్కోవచ్చో చెబుతున్నాడు. అతని మాటల వివరాల్లోకి వెళ్తే…

కరోనా లక్షణాలు కనిపించగానే కలవరపడొద్దన్నాడు. ప్రాణాలు పోతాయని కంగారు అసలే వద్దని చెబుతున్నాడు. కరోనా సోకిందన్న ఆందోళనతో ఎక్కడికీ పారిపోవద్దని సూచించాడు. ఆసుపత్రిలో చేరాలని పిలుపునిచ్చాడు. వైద్య చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరమని సలహా ఇస్తున్నాడు.

లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న తాను మార్చి 10న బయల్దేరి 12న ఇండియాలో అడుగు పెట్టానని చెప్పాడు. తానొచ్చిన నాలుగురోజుల తరువాత అంటే 16న జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయని చెప్పాడు. ఆలస్యం చేయకుండా రిమ్స్‌ వైద్యులను సంప్రదించానని తెలిపాడు. వెంటనే వారు తనను ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారని చెప్పాడు. 18న తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించాడు.

తొలి రోజు ఆందోళనకు గురైన తనకు వైద్యులు మనోధైర్యం కల్పించి, సమయానికి మందులు, ఆహారం ఇస్తూ చికిత్స అందించారని చెప్పాడు. దీంతో తాను కోలుకోవడం ఆరంభించానని చెప్పాడు. కరోనా ఏమీ చేయదని, అయితే వైద్యులు చెప్పినట్టు చేయాలని సూచించాడు. అలా చేస్తే, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజానికి మేలు జరుగుతుందని తెలిపాడు. ఇప్పటికే ఆ లక్షణాలు ఉన్నయనుకున్న వారు వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించాడు.

Tags: coronavirus, covid-19, corona recovered person, prakasam district

Advertisement

Next Story

Most Viewed