టీఆర్‌ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. ఆసుపత్రుల బాటపట్టిన నాయకులు

by Sridhar Babu |   ( Updated:2021-10-13 04:11:03.0  )
టీఆర్‌ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. ఆసుపత్రుల బాటపట్టిన నాయకులు
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్‌లో అధికార పార్టీ నాయకులు ఓటర్ల చుట్టూ తిరగడం మాని దవాఖాన్ల బాట పట్టారు. ప్రచారంలో కీలకంగా పనిచేసిన నాయకులు తమ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో చాలా మంది నాయకులు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునే పనిలో పడ్డారు.

బుధవారం ఒక్క రోజే హుజురాబాద్ ఆసుపత్రిలో 28 మంది టెస్ట్‌లు చేయించుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌కు పాజిటివ్ అని తేలడంతో బుధవారం ఉదయం నుండి నేతలంతా టెస్ట్‌లు చేయించుకునే పనిలో పడ్డారు. హుజురాబాద్ ఆసుపత్రిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకే కరోనా టెస్టుల కోసం షాంపిల్స్ సేకరిస్తుండటంతో కొంత మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించినట్టుగా సమాచారం.

స్వీయ రక్షణపై దృష్టి..

టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కరోనా గుబులు మొదలు కావడంతో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది నాయకులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కరోనా వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీని పెంచేందుకు అవసరమైన డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఇతర ఆహారాన్ని తీసుకుంటున్నట్టుగా సమాచారం.

అప్పుడే తెలిసేనా..?

సాధారణంగా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ టెస్ట్‌ల ద్వారా నిర్ధారణ కావాలంటే మూడు నుండి ఐదు రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా ఆర్టీపీసీఆర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే కాకుండా సీటీ చెస్ట్ కూడా చేయించుకుంటే కరోనా లక్షణాలు ఉన్నాయో లేదా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు హుజురాబాద్ నాయకులు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed