- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్లపై పాజిటివ్ పేషెంట్ దాడి
దిశ, న్యూస్ బ్యూరో:
గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లపై ఒక పేషెంట్ సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. కరోనా పాజిటివ్ లక్షణాలతో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేషెంట్ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ మృతుని సోదరుడు అదే వార్డులో డాక్టర్లపై దాడి చేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి సంఘటన పోలీసులకు తెలిసినా మృతదేహం అక్కడే ఉండడంతో కొద్దిసేపు ఘర్షణ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడానికి తటపటాయించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసులు జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చి ఎర్రగడ్డలోని ఛెస్ట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూ ఉంటే డాక్టర్లు మాత్రం చికిత్స చేయడానికి ముందుకొస్తున్నారని, ఇలాంటి సమయంలో వారిపై దాడి చేయడం సహేతుకం కాదని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మరోవైపు చికిత్స చేస్తున్న డాక్టర్లకు పోలీసు భద్రత కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని, ఇలాంటి దాడులకు డాక్టర్లు భయపడతారని భావిస్తే అది భ్రమే అవుతుందని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్సింగ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాణభయం ఉన్నా, కుటుంబానికి రిస్కు ఉన్నా సామాజిక బాధ్యతతో డాక్టర్లు వైద్య చికిత్స చేస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు.
కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేయడానికి తగిన వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు లేకపోయినా, ఎన్నో అసౌకర్యాలు ఉన్నా, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది దేశవ్యాప్తంగా పేషెంట్లకు చికిత్స చేస్తున్నారని, ప్రభుత్వపరంగా వార్డుల్లో ఎన్ని లోపాలు ఉన్నా చివరకు డాక్టర్లే ‘సాప్ట్ టార్గెట్’ అవుతున్నారని, దీన్ని ప్రభుత్వం లోతుగా ఆలోచించాలని అన్నారు. దాడిచేసినవారిని కఠినంగా శిక్షించడంతోపాటు ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే డాక్టర్లు చికిత్స చేయడానికి భయపడతారని, అదే జరిగితే ప్రస్తుతం కరోనా మహమ్మారి వెంటాడుతున్న సమయంలో అంతిమంగా పేషెంట్లకే అన్యాయం జరుగుతుందని ఆయన గుర్తుచేశారు. మరోవైపు జూనియర్ డాక్టర్లు సైతం ఎస్పీఎఫ్ పోలీసు భద్రత కల్పించాలని, ఆసుపత్రి ఆవరణలో ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ విధులను బహిష్కరించాలన్న డిమాండ్ ముందుకొస్తోందని, అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన దాడిలో పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు వేణుగోపాల్, శివ గాయపడ్డారు.
భద్రత కల్పిస్తాం : నగర పోలీసు కమిషనర్
గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, ఇకపైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతను పెంచుతున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుత కీలక సమయంలో డాక్టర్లు ఎంతో రిస్కు తీసుకుని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారని, వారిపై దాడి జరగడాన్ని సహించేది లేదన్నారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ జరిగిన దాడి వివరాలను తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదనపు డీసీపీ నేతృత్వంలో ఆసుపత్రిలో వైద్యులకు, వైద్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని, ఇప్పుడున్న భద్రతను మరింత పెంచుతామని అన్నారు. మొత్తం దేశమే కరోనాతో యుద్ధాన్ని చేస్తున్న సమయంలో ఇలాంటి దాడి జరగడం వైద్య సిబ్బంది మనోస్థయిర్యాన్ని దెబ్బతీస్తుందని, వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు, కేసు నమోదు తప్పవని హెచ్చరించారు.
Tags: Telangana, Corona, Patient, Gandhi Hospital, Attack on Doctors, Police Protection