మంత్రి ఈటల ఓఎస్డీకి కరోనా

by vinod kumar |
మంత్రి ఈటల ఓఎస్డీకి కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు ఓఎస్డీగా ఉన్న ఓ వైద్యాధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడానికి ఒక రోజు ముందు వరకూ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ అధికారికి పాజిటివ్ వచ్చిన సమాచారాన్ని మంత్రికి కూడా తెలియజేశారు. ఈ సమాచారం అందుకోడానికి కొన్ని గంటల ముందే ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలో ఈ వైద్యాధికారి ఒక సభ్యుడిగా ఉన్నారు.

కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్య సిబ్బందిలో ఇప్పటికే పదుల సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ఈ అధికారి నిమ్స్‌లోనే విధులు నిర్వర్తిస్తూ మంత్రికి అనధికారికంగా ఓఎస్డీగానూ, వైద్య సలహాదారుగానూ ఉన్నారు. ఇప్పుడు కరోనా బారిన పడడంతో మంత్రి క్వారంటైన్‌లోకి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు వ్యక్తిగత సహాయకుడికి పాజిటివ్ రావడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో మంత్రిగా ఈటల రాజేందర్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లక తప్పదు కాబోలు.

Advertisement

Next Story

Most Viewed