కోఠి ఈఎన్టీలో కరోనా కలవరం

by vinod kumar |
coronavirus
X

దిశ , హైదరాబాద్: కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో ఓ పీజీ వైద్య విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో హాస్పిటల్‌లో శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. జియాగూడలో నివాసముంటున్న విద్యార్థిని పీజీ మొదటి సంవత్సరం కోర్సులో భాగంగా ఈఎన్టీ ఆస్పత్రిలో ట్రైనీగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఇటీవల జియాగూడ పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో హాస్పిటల్ అధికారులు ఆమెను విధులకు రావద్దని సూచించారు. ఐనా ఆమె వారి సూచనలు లెక్క చేయకుండా విధులకు హాజరు కావడంతో పాటు ఆపరేషన్ థియేటర్లో సైతం పని చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం విద్యార్థిని అంబులెన్స్‌లో రావడం గమనించిన సూపరింటెండెంట్ శంకర్ ఆమెకు కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఆయన డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో పాటు సదరు పీజీ వైద్య విద్యార్థినిని తదుపరి వైద్య చికిత్సల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా డీఎంఈ ఆదేశాల మేరకు రెండు రోజులుగా ఈఎన్టీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేపడుతున్నారు. ప్రస్థుతం ఇక్కడ పని చేస్తున్న వైద్యులు, సిబ్బందిని రెండుగా విభజించి ఒక్కో బ్యాచ్ వారం రోజుల పాటు షిప్ట్ పద్దతిన పని చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హాస్పిటల్లో పని చేస్తున్న వారికి చేపట్టిన కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. ఓపీ సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed