సచివాలయంలో కరోనా కలకలం

by  |
సచివాలయంలో కరోనా కలకలం
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. వారికి నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో వారితో ఇప్పటివరకూ కలిసి ఉన్న మిగిలిన ఉద్యోగులను విభాగాధిపతులు క్వారంటైన్‌లోకి పంపారు.

బీఆర్‌కేఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో ఉన్న ఆర్థిక శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17 మందికి పాజిటివ్ సోకిందన్న వార్త మిగిలిన విభాగాలు, అంతస్తుల్లోని ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. ఏప్రిల్ నెలలో కరోనా పట్ల భయం ఇంకా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఆర్థిక శాఖలోని ఉద్యోగులకే కరోనా ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు రావడం గమనార్హం.

పాజిటివ్ ఉద్యోగులతో కలిసి పనిచేసినవారు, కాంటాక్టులోకి వెళ్ళినవారిని కూడా గుర్తించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ మొదలైంది. ఇంకా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే ఏ విభాగం అధిపతి కూడా ఉద్యోగులకు పాజిటివ్ సోకిందనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. తోటి ఉద్యోగులకు మాత్రం తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. తాజాగా పాజిటివ్ సోకినవారిలో డిప్యూటీ సెక్రటరీలతో పాటు అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు కూడా ఉన్నారు.


Next Story

Most Viewed