రూ.5.10 కోట్ల గంజాయి స్వాధీనం.. నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి సంచలన నిర్ణయం

by Nagaya |
రూ.5.10 కోట్ల గంజాయి స్వాధీనం.. నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి సంచలన నిర్ణయం
X

దిశ, నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా పైన పోలీసుల ఉక్కుపాదం మోపారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల నమోదు అయ్యాయని, ఈ సందర్భంగా 2043 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. దీని విలువ 5 కోట్ల 10 లక్షల 75వేల రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. కోర్టు ఆదేశం మేరకు గురువారం నిర్మానుష్య ప్రాంతమైన నార్కట్‌పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని నిర్వీర్యం చేశామని వివరించారు.

గంజాయి సరఫరా చేసే వారిపైన ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్పీ చందనా దీప్తి చెప్పారు. జిల్లా పరిధిలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాల రవాణా చేసే వారిపై దాడులు నిర్వహిస్తూ, ఎంతో మందిని అరెస్టు చేసి జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. యువత తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల తమ బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లాలోని యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కళాశాలల్లో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712671111 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ చందనా దీప్తి కోరారు.

Advertisement

Next Story

Most Viewed