- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్లతో ప్రైవేట్ ఆసుపత్రులు ఫుల్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్లతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల బెడ్‌లు నిండిపోయాయి. ఆపరేషన్ థియేటర్ల స్టాఫ్ కూడా కరోనా వార్డులకే షిఫ్ట్ అవుతున్నారు. సాధారణ (సెలెక్టివ్) ఆపరేషన్లు నిలిచిపోయాయి. ప్రైవేట్ ల్యాబ్‌లలో కరోనా టెస్టుల రద్దీ పెరిగిపోయింది. కొన్ని ఆసుపత్రుల్లో వారం రోజులదాకా అపాయింట్ మెంట్ దొరకడం లేదు. రోజుకు ఎన్ని టెస్టులు చేసే సామర్థ్యం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ నగరంలోని మొత్తం 18 ప్రైవేటు ల్యాబ్‌లను సందర్శించి నివేదిక తయారు చేసింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వివరాలను మాత్రమే ప్రభుత్వానికి ఇస్తున్నాయి తప్ప రోజువారీ ఎన్ని టెస్టులు చేశాయో వివరాలను ఇవ్వడం లేదని తేలింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల్లో యాభై వేల టెస్టులు చేయాలని అనుకున్నా కొద్దిమంది టెస్టింగ్ సిబ్బందికి, ల్యాబ్‌లలోని మైక్రో బయాలజిస్టులకు పాజిటివ్ రావడంతో శాంపిల్ కలెక్షన్లకు, పరీక్ష చేసి రిపోర్టు తయారు చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అత్యవసర కేసులకు మాత్రం శాంపిల్ తీసుకుని ప్రైవేటు ల్యాబ్‌లకు పంపాల్సి వస్తోంది. ఇందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరను వైద్యారోగ్య శాఖ చెల్లిస్తోంది. ఈ కారణంగానే రెండు రోజుల పాటు శాంపిళ్ళు తీసుకోడానికి విరామం ఇచ్చినట్లు తెలిసింది.
ప్రభుత్వం ప్రతిరోజూ విడుదల చేస్తున్న బులెటిన్ ప్రకారం చూస్తే ప్రభుత్వాసుపత్రుల్లో పది శాతం మేర కూడా బెడ్‌లు నిండడంలేదు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కరోనా పేషెంట్లకు బెడ్‌లు సరిపోవడంలేదు. కరోనా వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. అటు ప్రైవేటు ల్యాబ్‌లలోనూ, ఇటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా అనుమానితులకు, పేషెంట్లకు వెయిటింగ్ లిస్టు తప్పడంలేదు. కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ల్లో పేర్లు నమోదుచేసుకున్న అనుమానితులకు వారం తర్వాత అపాయింట్‌మెంట్ దొరుకుతోంది. ప్రభుత్వం రోజుకు సగటున నాలుగు వేల వరకూ టెస్టులు చేస్తుండగా నగరంలోని మొత్తం 18 ప్రైవేటు ల్యాబ్‌లు ఎన్ని టెస్టులు చేస్తున్నాయో ప్రభుత్వం దగ్గర వివరాలు లేవు. ఒక ప్రైవేటు ల్యాబ్‌లో చేసిన టెస్టుల్లో 280 పాజిటివ్ వచ్చాయి. అనుమానం వచ్చిన ప్రజారోగ్య శాఖ అధికారులు ఆరా తీయగా పది రోజుల వ్యవధిలో మూడువేల టెస్టులు చేసినట్లు తేలింది. పరీక్షలు చేయించుకుని నెగెటివ్ వచ్చినవారి వివరాలు ఇవ్వకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు తమకు రోజుకు 2400 టెస్టులు చేసే సామర్థ్యం ఉందని చెప్పడంతో ప్రభుత్వం 1700 టెస్టింగ్ కిట్లు సరఫరా చేస్తే కేవలం 300 మాత్రమే చేయగలిగినట్లు ఈ తనిఖీల్లో తేలింది.
గాంధీ ఆసుపత్రికి కరోనా ఫియర్
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ పేషీలో నలుగురికి పాజిటివ్ వచ్చిన విషయం తెలుసుకున్న ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. డాక్టర్లకు, పారామెడికల్ స్టాఫ్‌కు కూడా వచ్చినట్లు తెలిసింది. ఆసుపత్రిలో మొత్తం 20 మంది వరకూ పాజిటివ్ వచ్చినట్లు గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి వెళ్ళడానికి కరోనా పాజిటివ్ పేషెంట్లు భయపడుతూ ఉంటే ఇప్పుడు స్టాఫ్‌లో కూడా కొత్త తరహా ఆందోళన మొదలైంది. పీపీఈ కిట్లు ఉన్నా లేకున్నా ఇన్‌ఫెక్షన్ వస్తోందన్న గుబులు వారిని వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో 19 మందికి పాజిటివ్ రావడంతో ఉద్యోగులంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇప్పుడు గాంధీలో కలకలం మొదలైంది.
చెస్ట్ ఆసుపత్రిలో సీనియర్ నర్సు మృతి
ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిలో కరోనా వార్డులో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ నర్సు కరోనా బారిన పడి శుక్రవారం మృతి చెందారు. ఈ నెల 30న ఆమె పదవీ విరమణ చేయనున్నారు. రెండు వారాల క్రితం వరకూ ఆమె చెస్ట్ ఆసుపత్రిలోని కరోనా వార్డులో పనిచేశారని, డయాబెటిస్ సమస్య కారణంగా ఆ వార్డులో పనిచేయలేనని చెప్పినా సూపరింటెండెంట్ బలవంతంగా ఆమెకు డ్యూటీ వేశారని తోటి నర్సులు ఆరోపించారు. వారం క్రితం అనారోగ్య లక్షణాలతో తొలుత ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అక్కడి వైద్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారన్నారు. అక్కడ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆక్సిజన్ కోసం వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చిందని నర్సులు వివరించారు. కరోనా కారణంగానే శుక్రవారం ఆమె చనిపోయారని, ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలోని పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతూ సూపరింటెండెంట్‌కు దాదాపు పాతిక మంది డాక్టర్లు, నర్సులు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు.
ఇప్పటికీ పీపీఈ కిట్లు సరిపోవడం లేదు : జూ.డా
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఇప్పటికీ పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల సమస్య ఉందని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు శుక్రవారం మెమొరాండం సమర్పించింది. క్షేత్రస్థాయిలో సరిపడా సంఖ్యలో ఇవి అందడంలేదని, సప్లయ్ చైన్ సిస్టమ్‌లో గ్యాప్ ఉందని పేర్కొంది. డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్నందున డైరెక్ట్ లేదా పర్మినెంట్ ప్రాతిపదికన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టాలని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరారు. గాంధీ ఆసుపత్రిలోని ఇతర వార్డులన్నింటినీ ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారని, కానీ అక్కడ కూడా కరోనా వార్డుల్ని పెట్టడం ద్వారా క్యాజువాలిటీ, ఓపీ విభాగాలకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని, అందువల్ల అక్కడ కరోనా ఐసొలేషన్ వార్డుని వెంటనే తీసేయాలని మంత్రిని కోరారు.