మంత్రి ఈటల అలా.. అధికారి ఇలా.. ఎవరి మాట నమ్మాలి..

by Shyam |
Corona virus
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా తీవ్రతపై అప్రమత్తం చేయాల్సిన వైద్యారోగ్య శాఖ ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతోంది. వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఒకలాగ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ మరోలా వ్యాఖ్యానాలు చేయడంతో కన్ఫ్యూజ్ కావడం ప్రజల వంతయింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి వృత్తిరీత్యా వైద్యులు కావడంతో వీరిద్దరి అభిప్రాయం ఒకేలా ఉంటోంది. కానీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు మాత్రం వీటికి భిన్నంగా ఉంటున్నాయి. ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరిస్తూ నిరంతరం అప్రమత్తం చేయాల్సిన ఒకే శాఖకు చెందిన బాధ్యత కలిగినవారు భిన్న స్వరాలను వినిపిస్తుండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.

పైగా మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌లో ఆదివారం చేసిన వ్యాఖ్యలకు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సోమవారం చేసిన వ్యాఖ్యలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ‘నిజానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ భయపెట్టినంత తీరులో లేదు. ఆయన కాస్త ఎక్కువ చేసి చెప్తున్నారు‘ అని వ్యాఖ్యానించారు. కానీ డైరెక్టర్, డీఎంఈలు మాత్రం రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, వ్యాప్తి మొదటి వేవ్‌కంటే సెకండ్ వేవ్‌లో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి సోకితే కొన్ని గంటల్లోనే మిగిలినవారందరికీ సోకుతుందని, ఇంట్లోనూ మాస్కు పెట్టుకోవాల్సిందేనని, ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు.

ఇలాంటి భిన్న ప్రకటన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు ప్రజలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకోవడం, హైదరాబాద్ నగరంలో వ్యాపారులు స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకోవడం లాంటివన్నీ చేస్తుండగా పరిస్థితి తీవ్రంగా లేదని మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీనికి తోడు డీహెచ్, డీఎంఈల మాటలకు తగినట్లుగా ప్రతీరోజు కొత్త కేసులు వందల నుంచి వేలల్లోకి పెరగడం, జిల్లాల్లో సైతం మూడంకెలకు చేరుకోవడం, మృతుల సంఖ్య కూడా డబుల్ డిజిట్‌లోకి వెళ్ళడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరకకపోవడం.. ఇవన్నీ మంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా ఉంటూ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ భయపడాల్సిన పని లేదని మంత్రి వ్యాఖ్యానిస్తూ ఉంటే, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ మాత్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితిని ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ మంత్రి కామెంట్ చేస్తున్నారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి వాస్తవ పరిస్థితిని చెప్పక తప్పదని డైరెక్టర్ అంటున్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే అయినా సమన్వయ లోపం, పరస్పర విరుద్ధమైన కామెంట్లు చేస్తుండడంతో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలో అర్థం కాక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కేవలం సమన్వయ లోపమేనా లేక మరేదైనా కారణం ఉందా అనే సరికొత్త చర్చలు వైద్యారోగ్య శాఖలో వినిపిస్తున్నాయి.

కేవలం కరోనా తీవ్రత విషయంలో మాత్రమే కాక గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే విషయంలోనూ మంత్రికి, డైరెక్టర్‌కు మధ్య తేడాలు ఉన్నాయి. గాలి ద్వారా వ్యాపిస్తోందనే అంశంలో శాస్త్రీయత లేదని, అది ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. కానీ డీహెచ్ మాత్రం క్లోజ్డ్ రూమ్‌లలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందేంత ప్రమాదకర స్థాయికి చేరిందని, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నప్పటికీ మాస్కులు ధరించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. సీసీఎంబీ సైతం ఫిబ్రవరిలోనే గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయంటూ డిసెంబరులో నిర్వహించిన అధ్యయనంలో వచ్చిన ఫలితాల ఆధారంగా వెల్లడించింది.

సెకండ్ వేవ్ పరిస్థితి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి స్వీయ జాగ్రత్తలు తీసుకోవడంపై హెచ్చరించాల్సిన వైద్యారోగ్య శాఖలో భిన్నమైన వ్యాఖ్యలు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో వాంఛనీయం కాదని ఆ శాఖ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed