ఐఐటీలో 66 మంది విద్యార్థులకు కరోనా..

by Shamantha N |
ఐఐటీలో 66 మంది విద్యార్థులకు కరోనా..
X

చెన్నై: ఐఐటీ మద్రాస్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పదుల సంఖ్యలో వెలుగుచూశాయి. 66 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. క్యాంపస్‌లో కరోనా కలకలానికి మూలం ఇంకా తెలియరాలేదు. హాస్టల్ మెస్‌లో విద్యార్థులు గుమిగూడాల్సి వస్తున్నదని, ఫలితంగానే కరోనా ఎక్కువమందికి వ్యాపించి ఉండవచ్చునని విద్యార్థులు చెప్పారు.

ఈ నెల 7 నుంచి విద్యా సంస్థలు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే 31 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిని వెంటనే గిండీలోని ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్‌లో చేర్చారు. ముందు జాగ్రత్తగా క్యాంపస్‌లోని అన్ని ల్యాబ్‌లు, సెంటర్లు, లైబ్రరీలను మూసివేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇతర విద్యార్థులు, సిబ్బందికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని పేర్కొంది. హాస్టల్స్‌ కేవలం పదిశాతం సామర్థ్యంతో నడుస్తున్నాయని, వీరందరినీ ఎవరి రూమ్‌లలో వారిని ఉంచామని, ప్యాక్డ్‌ ఫుడ్ పంపిస్తున్నామని వివరించింది. క్యాంపస్‌లో ప్రస్తుతం 700 మంది విద్యార్థులున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed