బల్దియాను వణికిస్తోన్న కరోనా

by vinod kumar |
బల్దియాను వణికిస్తోన్న కరోనా
X

– ఇండ్ల నుంచే ఉన్నతాధికారుల విధుల నిర్వహణ
– క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారిలో ఇద్దరికి లక్షణాలు

దిశ, న్యూస్‌బ్యూరో : కరోనా కేసులు తగ్గిపోయాయని, లాక్‌డౌన్ ఎత్తేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరో వైపు కొవిడ్ – 19 వైరస్‌ భయంతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇండ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. బల్దియా పరిధిలోని క్వారంటైన్ జోన్లు, సిబ్బందిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు ఫోన్లతోనే నడిపిస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనన్న భయంతోనే సిబ్బంది పనులు చేస్తుండటం గమనార్హం.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ దేశంలోనే నాలుగో నగరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేసింది. హోం క్వారంటైన్‌తో పాటు నగరంలో కరోనా లక్షణాలు, పాజిటివ్ ఉన్న వ్యక్తులున్న ఏరియాలను కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. సుమారు రెండొందలకు పైగా కంటైన్‌మెంట్ జోన్లు నగరంలో ఉన్నట్టు అంచనా. అయితే కంటైన్‌మెంట్ జోన్లు, రోజూవారీ కరోనా పాజిటివ్ కేసులపైనా బల్దియా ఉన్నతాధికారులు రహస్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగానే పనిచేస్తున్నాయి. వీటిలో భాగంగా రెండు, మూడు సర్కిళ్లకు కలిపి ఓ ప్రత్యేకాధికారిని నియమించారు. కంటైన్‌మెంట్ జోన్ల కోసం నోడల్ అధికారులను, ఆ జోన్లలో పనిచేసేందుకు మెడికల్, పోలీస్, శానిటేషన్, ఎంటమాలజీ, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ శాఖలతో కలిసిన టీమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ, టీమ్‌లోని సభ్యులను మానిటర్ చేసేందుకు నియమించిన నోడల్ అధికారులు గానీ, జోనల్ స్థాయి అధికారులు గానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. వీరు ప్రజలకు కావాల్సిన సేవలందించేందుకు పనులు అప్పజెప్పడంతో పాటు కంటైన్‌మెంట్‌లోని ప్రజలతో వ్యవహరించేటపుడు తీసుకోవాల్సిన జాగ్రతలపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. లేదంటే కరోనా వారియర్స్ కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. చాలా చోట్ల సిబ్బంది మాస్క్, గ్లౌజ్‌లు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. వారిని కనీసం పట్టించుకునే వారు లేరు.

సెంట్రల్ జోన్‌లో ఓ కంటైన్‌మెంట్ జోన్‌లో ఉదయం రావాల్సిన మెడికల్ సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బంది వచ్చి మూడు షిఫ్ట్‌ల్లో తమ పని చేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే 11 దాటిన తర్వాత జోన్ల వద్ద ముగ్గురి కంటే ఎక్కువ సిబ్బంది కనిపించడం లేదు. ఆ జోన్‌లో ప్రతి రోజూ కనీసం ఒకసారి కూడా పర్యవేక్షించకుండానే నోడల్ అధికారి విధులు ముగిస్తుండటం గమనార్హం. అలాగే ఎల్బీ నగర్‌ జోన్ పరిధిలో ఓ కంటైన్‌మెంట్ జోన్ బాధ్యతలు చూస్తున్న ఓ ఉన్నతాధికారి ఎప్పుడూ తన కార్యాలయంలో కనిపించరు. ఆఫీసు సిబ్బందిని అడిగితే ఫీల్డ్‌కు వెళ్లారని చెబుతారు. జోన్ వద్ద ఉన్న కింది స్థాయి సిబ్బందిని అడిగితే హెడ్‌ ఆఫీస్‌లో మీటింగ్‌లో ఉన్నారని తెలిపారు. అసలు నిజం చెప్పండి.. ఆయన ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా లేదా అంటే.. పెద్ద ఆఫీసర్ల గురించి మాకెలా తెలుస్తుందండీ అని సమాధానమిస్తారు. సదరు అధికారిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.

ఆల్ ఈజ్ వెల్ డ్యూటీలు..

ఉన్నతాధికారులు రాకపోయినా రిపోర్టులు మాత్రం అన్ని బాగున్నట్టే వస్తున్నాయి. సమయంతో సంబంధం లేకపోయినా మెడికల్, ఎంటమాలజీ, శానిటేషన్ సిబ్బంది తమ పనులు చేసినట్టు రిపోర్టులు మాత్రం వస్తున్నాయి. ఇంట్లో ఉండే రిపోర్టులను సిద్ధం చేస్తుండటం విశేషం. జోన్ల పరిధిలో తమకు అనుకూలంగా ఉండే సిబ్బందిని ఒక్కొకరిని డ్యూటీలకు వేసుకోవడంలో సదరు జోనల్, నోడల్ అధికారులు సఫలీకృతులయ్యారని తెలుస్తోంది. తమ చెప్పుచేతుల్లో ఉండే సిబ్బంది ద్వారా ఫోటోలు తీయించి వాటినే హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఫోన్లలో కాంటాక్ట్ చేసుకొని ఇంట్లో నుంచే కొందరు అధికారులు తమ డ్యూటీలను ముగిస్తున్నారు. వీరిలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తుండగా.. మరికొందరు వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోననే భయంతో చేస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి వివరించారు.

క్షేత్రస్థాయి సిబ్బందిలో భయాందోళనలు..

అధికారులు తమ హోదాలను ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నా శానిటేషన్, ఎంటమాలజీ, మెడికల్ విభాగాల్లో కింది స్థాయి సిబ్బందికి భయాందోళనలు తప్పడం లేదు. కంటైన్‌మెంట్ జోన్లలో తమకు వైరస్ ఎక్కడ అంటుకుంటుందోననే భయం వారిలో కనిపిస్తోంది. బల్దియా పరిధిలో ఇప్పటికే సర్కిల్ స్థాయి అధికారితో పాటు శానిటేషన్ సూపర్ వైజర్ కూడా కరోనా పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే వీరి వివరాలను గానీ, కేసుల నిర్ధారణను గానీ బల్దియా అధికారికంగా ధృవీకరించడం లేదు. ఇండ్ల వద్ద నుంచి పనిచేస్తున్న అధికారులను ప్రశ్నించాలన్నా, కనీసం తమకు మాస్క్‌లు, గ్లౌజులు వంటివి సరఫరా చేయాలని అడగాలన్నా సిబ్బందికి ధైర్యం చాలడం లేదు. వారిలో చాలా వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావడంతో ఏ నిమిషమైనా ఉద్యోగం పోతుందనే భయం కనిపిస్తోంది. ఒక వేళ అడగకపోతే ప్రాణమే పోయేలా ఉంది. ఓ వైపు కరోనా, మరో వైపు ఉద్యోగం రెండింటికీ తలొగ్గి భయాందోళనలతోనే వారు తమ విధులకు హాజరవుతున్నారు.

Tags: corona, effect, containment zone, GHMC, sanitation

Advertisement

Next Story

Most Viewed