‘అన్నం’పూర్ణ ఇక ఉచితం..

by Shyam |   ( Updated:2020-03-26 09:02:45.0  )
‘అన్నం’పూర్ణ ఇక ఉచితం..
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ (కోవిడ్ -19) కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్‌లో చిన్న, చిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలకు అవసరమైన మేరకు అధికారులు, పోలీసులు కొన్నిచోట్ల చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో నివసించే వారికి పర్వాలేదనిపించినా హాస్టళ్లు, రోడ్లపై ఉండే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల వైపు మొగ్గు చూపుతోంది.

ఆకలిగా ఉన్న వారికి సాంత్వన..

లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో ఈ నెల 24 వరకూ అన్నపూర్ణ క్యాంటీన్లు సరిగా నిర్వహించలేదు. కొన్నిచోట్ల భోజనాన్ని తయారు చేసుకుని వెళ్తున్న బల్దియా వాహనాలను చెక్ పోస్టుల వద్ద అడ్డుకున్న ఘటనలూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ, పోలీసులు సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా మంచి నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి అన్నపూర్ణ సెంటర్లలో ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. గతంలో రూ.5 తీసుకుని ఒక పూట భోజనాన్ని అందించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ భోజనం దినసరి, అడ్డా కూలీలు, విద్యార్థులకు, సొంతంగా నివాసం లేనివారికి, అనాథలకు కడుపు నింపేది. ప్రస్తుత పరిస్థితుల్లో సంపాదన మార్గాలు లేక ఎలా బతకాలో కూడా తెలియని వారందరికీ ఈ నిర్ణయం సాంత్వన కలిగిస్తోంది. గ్రేటర్ పరిధిలో 150 కేంద్రాల ద్వారా 25 నుంచి 30 వేల మందికి జీహెచ్ఎంసీ ఈ భోజనాన్ని అందిస్తోంది. ఒక్కో కేంద్రంలో కనిష్టంగా వంద మందికి భోజనాన్ని అందించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం చాలా మంది ఎక్కడిక్కడే ఉండిపోవడం, ఊర్లకు వెళ్లడంతో 50 మంది మాత్రమే భోజనానికి వస్తున్నారని ఓ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకూ ఉచిత భోజనం అందిస్తామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి..

21 రోజులు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో నగరంలో ఉన్న కొంత మంది నగరం విడిచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. హాస్టళ్లలో ఉంటున్నవారు, విద్యార్థులు, ఉద్యోగులు, అద్దె ఇండ్లలో ఉండేవారు, దూర ప్రాంతాలకు చెందిన కూలీలు, వ్యాపారులు అందరూ ప్రయాణాలను మొదలెట్టినా రెండ్రోజులుగా పోలీసులు ఎక్కడికక్కడా అడ్డుకుంటున్నారు. తిండి, ఉండేందుకు నివాసం లేక తాము ఎక్కడికి వెళ్లాలని పలు చోట్ల నిరసనలూ వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు ఊర్లకు వెళ్లేవారికి సహకరిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులు, రైళ్లు నడవకపోవడంతో నిత్యవసరాలను తరలిస్తున్న వాహనదారులతో మాట్లాడి మరీ తమ కొందరు పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సొంతూర్లకు కుటుంబాలతో సహా వెళ్తున్న వారికి పోలీసులు తగిన సూచనలు చేస్తూ పంపిస్తున్నారు. నగరంలో హాస్టళ్లలో ఉండేవారిని ఖాళీ చేయించొద్దని ప్రభుత్వమే వారి బాధ్యతను తీసుకుంటుందని ఇప్పటికే ప్రకటించారు. కరోనా అత్యవసర పరిస్థితులు మొదట్లో కొంత గందరగోళంగా ఉన్న ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుండటంతో ప్రజల్లో ఆందోళన వాతావరణం కూడా తగ్గుతోంది.

tags : GHMC, Annapurna, ktr, free meals, Bonthu, corona

Advertisement

Next Story

Most Viewed