అర్ధాకలితో అలమటిస్తున్న కార్మికులు

by Shyam |
అర్ధాకలితో అలమటిస్తున్న కార్మికులు
X

దిశ, న్యూస్‌ బ్యూరో: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా లాక్‌‌డౌన్ అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా వర్తక వ్యాపార రంగ సంస్థలు మూతబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో కొంత మేరకు సడలింపు ఇవ్వడం జరిగింది. కానీ, షాపింగ్ మాల్స్, హోటల్స్‌లకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లేకపోవడంతో లక్షలాది మంది కార్మికులు పనులు లేక చేతిలో చిల్లగవ్వ లేకపోవడంతో అర్థాకలితో అలమటిస్తున్నారు. 48 రోజుల నుంచి ఇళ్లకే పరిమితమైన కార్మికులు యాజమాన్యాల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు షాపులు ఓపెన్ అవుతాయో చేతినిండా పనులు దొరికితేగానీ మూడు పూటల తిండి దొరికేటట్లు లేదని షాపింగ్ మాల్, హోటల్స్, వర్తక రంగల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా యాజమాన్యాలకు లాక్‌డౌన్ సమయంలో కార్మికులకు వేతనాలు ఇచ్చి ఆదుకోవాలిన ఆదేశాలు సైతం జారీ చేశాయి. కానీ, ప్రైవేట్ రంగ సంస్థల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలు బేఖతార్ చేస్తూన్నాయి. పెద్ద.. పెద్ద సంస్థలు కూడా కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. మరి కొన్ని యాజమన్యాలు మాత్రం జీతాలు ఇచ్చేది లేదంటూ చేతులెత్తేశాయి. రాష్ట్రంలో వివిధ వర్తక రంగాల్లో, షాపింగ్ మాల్స్, హోటల్స్ లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నవారు లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంతో 48 రోజులుగా ఇంటికే పరిమితమైన కార్మికులకు యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ జీవనం అగమ్యగోచరంగా మారింది. షాపింగ్ మాల్స్‌లలో సేల్స్ ఎక్స్ క్యూటివ్, సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వేలలో వేతనాలు తీసుకున్న ఉద్యోగుల నుంచి స్వీపర్ వరకు చాలి చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. రెండు నెలలుగా వచ్చే అత్తెసరు జీతాల్లో సగం కోత విధించి ఇవ్వడంతో వారి బతుకులు మరింత కష్టాల ఊబిలోని నెట్టబడ్డాయి. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం కూడా కష్టాలు తప్పనట్లుగా ఉన్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ తో అన్ని వ్యాపార సంస్థల ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితిలో వ్యాపారులు ఇప్పట్లో లాభాసాటిగా నడిచే పరిస్థితి లేకపోవడంతో ఆయా సంస్థలు ముందస్తుగా స్టాఫ్‌ను తగ్గించుకనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎంత మంది ఉద్యోగాలు ఉంటాయో.. ఎంత మందివి ఊడుతాయోనన్న భయాందోళన కార్మికులను వెంటాడుతోన్నది.

సగం వేతనమే ఇచ్చారు: యాదగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా

పదిహేను ఏండ్ల నుంచి ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ‌లో సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్నాను. నాకు నెలకు వచ్చే రూ.30 వేల జీతంతో కుటుంబాన్ని సాకుతున్నాను. రెండు నెలల నుంచి అత్తెసరు వేతనం వస్తుండడంతో జీవనం కష్టంగా మారింది. నా ఒక్కడి జీతం పైనే ఇళ్లు గడువాలి. పిల్లలా స్కూల్ ఫీజుల బాకాయిలు పెరుగుతున్నాయి. ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించమని యజమానులు డిమాండ్ చేయనప్పటికీ అప్పులు పేరుకుపోతున్నాయి. బ్యాంక్ ఈఎమ్ఐ‌లు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వస్తోన్నది. నిత్యావసర సరుకుల్లో కూడా సగం సగం తెచ్చుకొని పూట గడుపుతున్నాం.

ఇప్పటికీ జీతం ఇవ్వలేదు: నరేందర్, వరంగల్ జిల్లా, షాపింగ్ మాల్ వర్కర్

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను యాజమాన్యాలు పాటించడం లేదు. మార్చి నెలలో 20 రోజుల జీతమే ఇచ్చారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలు ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. యాజమాన్యాలు ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. జీతం వస్తే గానీ ఇంట్లో పూటగడిసే పరిస్థితి లేదు. అప్పు తెచ్చుకొని తిందామన్నా వడ్డీ వ్యాపారులు ఇప్పట్లో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదంటూ ముఖం మీదనే చెబుతున్నారు. కుటుంబాన్ని ఎట్లా సాకలో అర్థం కావడం లేదు.

Advertisement

Next Story