అన్నా.. చెల్లెళ్లను వేరు చేసిన కరోనా

by Anukaran |
అన్నా.. చెల్లెళ్లను వేరు చేసిన కరోనా
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రమేశ్..ప్రకాశం బజారులో బుక్ స్టాల్‌ను కొన్నేండ్లుగా నిర్వహిస్తున్నాడు. రమేశ్ కుటుంబానికి అదే జీవనాధారం. రమేశ్‌కు ఒక అక్కతో పాటు చెల్లి ఉంది. వీరు ఏటా రాఖీ పౌర్ణమికి ఎక్కడా ఉన్న నల్లగొండకు వచ్చి రమేశ్‌కు రాఖీ కట్టి వెళ్తారు. ఆ సందర్భంగా రమేశ్ అక్కా చెల్లెలికి చీరలు పెట్టి లేదా డబ్బులో గిఫ్ట్‌గా ఇచ్చి సంతోషంగా పంపేవాడు. అయితే, ఈసారి పరిస్థితులు మారాయి. అన్నాచెల్లెల్ల ఆత్మీయ అనుబంధానికి కరోనా అడ్డుతగిలింది. కొవిడ్ తెచ్చిన కష్టాలతో తన జీవనాధారమైన స్టాల్ నడువకపోవడంతో పూటగడవడమే కష్టంగా ఉన్న సమయంలో చెల్లెల్లకు రాఖీ సందర్భంగా ఏమివ్వాలని తనకు తానే మథనపడుతున్నాడు. ఆడబిడ్డలు సైతం పుట్టింటికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు.

రూ.10 లక్షలు అప్పు చేసి మరీ..

జూన్‌లో స్కూల్స్ ఓపెనింగ్ సీజన్ కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేసి మరి బుక్ స్టాల్‌లోకి సరుకు తెచ్చిపెట్టాడు రమేశ్. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలుగా బుక్‌స్టాల్‌ను ఇంతవరకు తెరవలేదు. ఉన్న సరుకు అమ్ముడు పోక పోనూ పెట్టుబడికి తెచ్చిన అప్పుకు వడ్డీ చెల్లించడం గగనంగా మారింది. ఓ వైపు నెలనెలా దుకాణం అద్దె చెల్లించడం.. కుటుంబాన్ని నెట్టుకురావడం తలకు మించిన భారం అయిపోయింది. ఇప్పటికే తెలిసిన వాళ్లందరి దగ్గర రూ.1,000 వరకు చేబదులు తీసుకున్నాడు. కానీ, కరోనా పరిస్థితులు చక్కబడక.. అవి తిరిగివ్వడం కష్టంగా మారింది. ఇదే సమయంలో రాఖీ పౌర్ణమి రావడం..అక్కాచెల్లెల్లు రక్షాబంధన్ కట్టేందుకు వస్తే.. వారి చేతిలో ఏం పెట్టాల్నో రమేశ్‌కు అర్థం కాట్లేదు. వారు వస్తే కనీసం కిలో చికెన్ తెచ్చే పరిస్థితులు లేవని చెబుతున్నాడు.

ఛిన్నాభిన్నమైన కుటుంబాలు..

కొవిడ్ మహమ్మారి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కూలో నాలో చేసుకుని మూడు పూటల ముద్ద బువ్వ తిని కాలం వెళ్లదీసే చిరుజీవులను రోడ్డున పడేసింది. రోడ్డు పక్కన బడ్డి కొట్టో.. టీస్టాలో.. కూరగాయాలో.. మరే ఇతర సరుకులో పెట్టుకుని అమ్ముకుంటూ తమ కుటంబాలను నెట్టుకొస్తున్న అనేక మంది కరోనా వైరస్ కకావికలం చేసింది. కరోనా నేటికీ నియంత్రణ కాకపోవడం.. జనజీవనం సాధారణ స్థితికి రాకపోవడంతో ఉపాధి అవకాశాలన్నీ తగ్గుముఖం పట్టాయి. చిన్న పట్టణాల నుంచి మహా నగరాల్లో ఏదో ఒక విధంగా పనిచేసుకుంటూ ఉన్నంతలో హాయిగా కాలం వెళ్లదీసేటోళ్లంతా.. ఏ పనీ లేక పల్లె ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ సరైన పనుల్లేక.. పూట గడవడమే కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో ఏ పండుగొచ్చినా..పబ్బమొచ్చినా..వారికి పచ్చడి మెతుకులు గతి లేకుండా పోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం జరగనున్న రక్షా బంధన్ నేపథ్యంలో అన్నాచెల్లెల ఆత్మీయతకు కరోనా వైరస్ కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. ఇతర గ్రామాలు, ప్రాంతాల్లో ఉన్న అక్కాచెల్లెలు పుట్టింటికి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. అదే సమయంలో అక్కాచెల్లెల్లు వస్తూవస్తూ తమ వెంట ప్రేమ అప్యాయలతతో పాటు కరోనా వైరస్‌ను ఎక్కడ మోసుకొస్తారోనన్న ఆందోళన వెంటాడుతోంది.

భారీగా తగ్గిన గిరాకీ..

రక్షా బంధన్ వస్తుందంటే చాలు..నాలుగు రోజుల ముందే నుంచే హడావుడి మొదలయ్యేది. దుకాణాల ముందు, రోడ్ల వెంట ప్రత్యేక స్టాల్స్ తెరుచుకునేవి. అందులో రకరకాల రక్షా బంధన్‌లు దర్శనమిచ్చేవి. ఆ పక్కనే ఘుమఘుమలాడే స్వీట్లు. వాటిని కొనుగోలు చేసే ఆడపడుచుల కోలాహలం మాములుగా ఉండేది కాదు. ఈ రాఖీ అయితే..మా తమ్ముడి చేతికి మంచిగ సరిపోద్ది అని ఒకరు.. ఇగో ఈ రాఖీ అయితే మా అన్న చేతికి కళకళలాడుద్ది.. అని మరో చెల్లి సంభాషణ. రాఖీలు కొనే సమయంలో వారి కండ్లలో ఆనందం. బిడ్డలింటికొస్తరని.. అమ్మానాన్నల ఎదురుచూపులు. దాదాపు రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు. ప్రతి ఇంట్లో ఇదే సందడి కన్పించేది. కానీ, నేడు ఆ పరిస్థితి అంతా తారుమారయ్యింది. అక్కడో ఇక్కడో ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలు సైతం వెలవెలబోతున్నాయి. స్వీట్ల ఘుమఘుమలు ముక్కుపుటాలకు తగలడం లేదు. ప్రజల్లో నిరుత్సాహం.. వ్యాపారుల్లో నిస్తేజం. ఎక్కడ చూసినా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రతి ఏటా రాఖీ పౌర్ణమికి చాలామంది వెండి, బంగారు రాఖీలను వారం పది రోజుల ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకునేవారు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. బంగారు రాఖీల సంగతేమో గానీ మాములు రాఖీలు కొనేందుకు ఎవరూ రావడం లేదంటూ వ్యాపారులు వాపోతున్నారు. కరోనా భయానికి కొంతమంది అక్కా చెల్లెల్లు.. ముందుగానే మేం ఈసారి రాలేకపోతున్నామంటూ ఇప్పటికే ఫోన్లు చేసి బాధతో చెబుతున్నారు. దీంతో పుట్టింటి వారు చిన్నబుచ్చుకుంటున్నారు. ఏదీఏమైనా కరోనా మహమ్మారి తెచ్చిన పరిస్థితులు అన్నీఇన్నీ కావు. ఇప్పటి వరకు కరోనా సోకి చనిపోతేనే.. కన్నవారికి, తోబుట్టువులకు దూరంగా ఉన్న పరిస్థితి చూశాం. ఇప్పుడు బతికి ఉన్నా.. చేతికి రక్షా బంధన్ కట్టేందుకు వెనకాడుతున్న హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story