కరోనా ఎఫెక్ట్: భారీగా తగ్గిన బల్దియా ఆదాయం

by Shyam |
GHMC
X

దిశ, సిటీ బ్యూరో: కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్, సిబ్బంది కొరత వంటి కారణాలతో వర్తమాన ఆర్దిక సంవత్సరంలో బల్దియా ఆదాయం గణనీయంగా తగ్గే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఎప్పటిలాగే ఈసారి కూడా జీహెచ్ఎంసీ పన్ను చెల్లింపులో బకాయిదారులకు రాయితీ ఇచ్చేందుకు అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం మంచి ఆదాయాన్నే ఇచ్చినా, ఆ తర్వాత జరిగిన కలెక్షన్ చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా కలెక్షన్ కొనసాగితే ఈ ఏటా లక్ష్యంగా పెట్టుకున్న టార్గెట్‌ను అధిగమిస్తామా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, కార్పొరేషన్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 1వ తేదీ నుంచి గ్రేటర్‌లోని అన్ని సర్కిళ్లలో కలిపి రోజుకి కోటి రూపాయలు చొప్పున ఆరు రోజులకు కేవలం ఆరు కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న ఒక్క రోజే సుమారు రూ. వంద నుంచి 150 కోట్ల వరకు కలెక్షన్ గరిష్టంగా వచ్చేది. కానీ రోజుకు కేవలం కోటి రూపాయలు వసూలు కావటం ఇదే ప్రథమం.

ఎర్లీబర్డ్ స్కీమ్ అమల్లో ఉన్న ఏప్రిల్, మే మాసాల్లో మొత్తం రూ. 524 కోట్లు వసూలయ్యాయి. ఇందులో క్షేత్ర స్థాయిలో పన్ను వసూలు చేసే 340 మంది బిల్ కలెక్టర్లు, 170 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు కలిపి సుమారు రూ.242 కోట్లు వసూలు చేశారు. ఇక జీహెచ్ఎంసీ నోటీసులిచ్చినా, ఇవ్వకపోయినా ఆస్తుల తాలుకూ బకాయిదారులే నేరుగా ఆన్‌లైన్‌లో రూ. 203 కోట్లు చెల్లించారు. కానీ బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు చేసిన కలెక్షన్ రికార్డు స్దాయిలో ఉందని అధికారులు మురిసిపోతున్నారు.

కానీ ఒకరిని మరొకరు వెనకేసుకొచ్చే విధానానికి బాగా అలవాటు పడిన అధికారులు ఒక విషయాన్ని గమనించటంలో ఘోరంగా విఫలమయ్యారు. ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు రికార్డు స్దాయిలో కలెక్షన్ చేసి ఉండవచ్చు కానీ జీహెచ్ఎంసీకి చెందిన బల్దియా సిబ్బంది ఎవరూ కూడా ఇంటి వెళ్లి పన్ను చెల్లించమని అడగకుండానే చెల్లించాల్సిన మొత్తం పనులో ఐదు శాతం రాయితీ కోసం బకాయిదారులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఆన్‌లైన్‌లో రూ.203 కోట్లు చెల్లిస్తే, మొత్తం 510 మంది ట్యాక్స్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించి రూ. 242 కోట్లు, అంటే స్వచ్చందంగా పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చిన జనాల కన్నా రూ.39 కోట్లు అదనంగా చెల్లించటం గ్రేట్ జాబ్ ఏమీ కాదని, వారి డ్యూటీ వారు చేశారని నగరవాసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఎర్లీబర్డ్ స్కీమ్ అమల్లో లేనపుడు రోజుకి కేవలం కోటి రూపాయల ట్యాక్స్ వసూలు కావటమేనని అంటున్నారు. ఏడాది పొడువున ట్యాక్స్ కలెక్షన్ విధులు నిర్వహించే ట్యాక్స్ సిబ్బంది ఈ నెల 1వ తేదీ నుంచి ఎందుకు కలెక్షన్ ఆశాజనకంగా చేయలేదో అధికారులే వివరించాలి.

ఈ ఏటా కలెక్షన్ టార్గెట్ రూ. 20 వేల కోట్లు

2021-22 వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2వేల కోట్ల ఆస్తి పన్నును వసూలు చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకుంది. గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 1850 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకోగా, అందులో రూ.1703 కోట్ల వరకు వసూలు చేసుకుంది. టార్గెట్‌ను అధిగమించకపోవటంతో ఉన్నతాధికారులు ట్యాక్స్ సిబ్బందిని మందలించినట్లు సమాచారం. ఒకవైపు బల్దియాలో ఆర్థిక సంక్షోభం మరో వైపు అన్ని రంగాలను, వర్గాలను కరోనా కష్టకాలం కుదేలు చేస్తోంది. ఈ క్రమంలో బల్దియా టార్గెట్‌గా పెట్టుకున్న ఆదాయాన్ని ఎలా వసూలు చేసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story