కేసీఆర్ సభతో హాలియాలో పెరిగిన కరోనా..!

by Shyam |
CM KCR Haliya sabha
X

దిశ, హాలియా: కరోనా సెకండ్ వేవ్ జనాలను వణికిస్తోంది. లాక్‌డౌన్ అనంతరం కరోనాపై నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పుడు మరోసారి మాస్కులు, శానిటైజర్లు వాడుతున్నారు. నాగార్జున‌సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన అనంతరం కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. సోమవారం ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మరణించారని వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలకు దాదాపుగా టెస్టు చేసుకుంటే పాజిటివ్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు.

సీఎం సభ అనంతరం పెరుగుతున్న కేసులు

ఉప ఎన్నికలో భాగంగా సీఎం కేసీఆర్ హాలియాలో బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభకోసం వేల సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు, కార్యకర్తలు, పోలీసులు జిల్లాలు దాటి వచ్చారు. లారీల్లో, బస్సుల్లో కిక్కిరిసిపోయారు. భౌతికదూరం పాటించకపోవడం, మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించకపోవడంతో కరోనా విజృంభనకు సులభతరం అయిందని నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనాకు ఇద్దరి మృతి..

నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన కొంగరి శ్రీనివాస్(35), హాలియా మున్సిపాలిటీ‌లోని సాయి ప్రతాప్ నగరుకు చెందిన శ్రీనివాస్(36) కరోనా బారిన పడి మృతి చెందినారు. వారిద్దరు కూడా 40 ఏండ్లలోపువారే కావడం గమనార్హం. దీంతో నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హాలియా పురపాలక సంఘం పరిధిలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా.. మునిసిపాలిటీ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారి చేశారు. కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఎవరి జాగ్రత్తలు వారు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed