- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠశాలల్లో కరోనా కలకలం.. ‘నో స్కూల్’ అంటున్న పేరెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని విద్యాసంస్థలు కొవిడ్‌తో సతమతమవుతున్నాయి. థర్డ్వేవ్భయంతో స్కూళ్లకు రావాలంటేనే విద్యార్థులు జంకుతున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు సైతం వెనుకడుగు వేస్తున్నారు. గురుకులాల్లో కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్ సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు ఇప్పుడిప్పుడే బడిబాట పట్టారు. దీంతో రెండేళ్ల తర్వాత విద్యార్థుల హాజరుశాతం 80 శాతానికి చేరువలో ఉంది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రెండు రోజుల్లో దాదాపు 500కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొందరు విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు జంకుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను బడికి పంపించేందుకు సుముఖంగా లేకపోవడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గినట్లుగా తెలిసింది. దాదాపు 20 శాతం వరకు విద్యార్థుల హాజరుశాతం తగ్గిందని సమాచారం. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న విద్యావ్యవస్థను ఈ మహమ్మారి మళ్లీ చిన్నాభిన్నం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పష్టత ఇవ్వని అధికారులు..
ఫస్ట్ వేవ్ లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. తద్వారా వారు చదువును కోల్పోయారు. ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చినా విన్నది మాత్రం కొందరే. కాగా కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ప్రత్యక్ష తరగతులను ప్రభుత్వం ప్రారంభించింది. అనూహ్యంగా వైరస్ వ్యాప్తి చెందడం, గురుకులాల్లో కేసులు పెరగడంతో పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గినట్లు తెలుస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. అయితే పలు జిల్లాల్లోని అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే విద్యార్థుల హాజరు శాతం అత్యధికంగా తగ్గినట్లు చెబుతున్నారు. రూరల్ ఏరియాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ప్రాంతాల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిందని వెల్లడిస్తున్నారు.
గురుకులాలే హాట్ స్పాట్లు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి ఈ విద్యా సంవత్సరానికి 60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమై మూడు నెలలు కావొస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గురుకులాల్లోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రెండు వారాల్లో మొత్తంగా దాదాపు 500 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇరుకు గదులు, కనీస సౌకర్యాలు లేకపోవడం, కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందినట్లు ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది. ఈ కారణంగా గడిచిన వారం రోజుల్లో హాజరు శాతం దాదాపు 20 శాతం మేర తగ్గింది. రెగ్యులర్‌గా వచ్చే విద్యార్థులు సైతం రెండు మూడు రోజులకోసారి వస్తున్నట్లు కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. సెకండ్ వేవ్‌లోనూ గురుకులాలే హాట్స్పాట్లుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడూ గురుకులాల్లోనే ఎక్కువ మందికి పాజిటివ్వస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విద్యాసంస్థల నిర్వహణ ప్రశ్నార్థకం
గురుకులాలతో పోల్చుకుంటే డే స్కాలర్ స్కూళ్లలో కొవిడ్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. ఆన్‌లైన్ విద్యాబోధన నుంచి ఆఫ్‌లైన్‌కి విద్యార్థులు అలవాటు పడుతున్న తరుణంలో కొవిడ్ వ్యాప్తి చెందడం పేరెంట్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. పాఠశాలలకు పంపించినా వైరస్బారినపడే ప్రమాదముందని జంకుతున్నారు. ఒకవేళ కరోనా విజృంభిస్తే ఇక విద్యాసంస్థల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి.
విద్యాశాఖ ప్రత్యేక చర్యలు..
విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, గురుకులాలను హాట్‌స్పాట్ల జాబితాలో చేర్చి వైరస్ నియంత్రణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తోంది. విద్యార్థులంతా మాస్క్‌లు ధరించేలా.. ప్రతీ క్లాసులో విధిగా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకునేలా.. జాగ్రత్తలు సూచిస్తోంది. నిన్నమొన్నటి వరకు బెంచీకి నలుగురైదుగురు విద్యార్థులు కూర్చోగా.. ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురినే పరిమితం చేస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలను ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
- Tags
- corona cases