చిన్నతరహా పరిశ్రమలపై కరోనా కాటు

by Anukaran |   ( Updated:2021-05-30 12:05:34.0  )
small scale industries
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసలు ఆర్డర్లు లేక గతేడాది నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కరోనా తగ్గి పరిస్థితులు సర్దుకుంటూ మళ్లీ పరిశ్రమలు జీవనం పోసుకుంటున్న తరుణంలోనే సెకండ్ వే తీవ్రతతో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కోలుకోలేని పరిస్థితికి చేరాయి. వేలమందికి కరోనా సోకగా, పదుల సంఖ్యలో నిర్వహకులు మృత్యువాత పడ్డారు. పరిశ్రమలు కొన్ని మూతపడగా, మరికొన్నింటిలో ఉత్పత్తి భారీగా తగ్గింది. పలువురు కరోనా నేపథ్యంలో పరిశ్రమలు తెరవాలంటేనే జంకుతున్నారు.

వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్దరంగం ఇండస్ట్రీ. గతేడాది నుంచి ఆ ఇండస్ట్రీని కరోనా వెంటాడుతోంది. అసలే ఆర్డర్స్ లేక ఇబ్బందులు పడుతున్న పరిశ్రమ చిన్నభిన్నమవుతోంది. రాష్ట్రానికే తలమానికగా చర్లపల్లి, కాప్రా, బాలానగర్, జీడిమెట్ల, పటాన్ చెరువు తదితర పారిశ్రామిక కారిడార్‌లున్నాయి. మొత్తం రాష్ట్రంలో 70వేల ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లు ఉన్నాయి. లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో సూక్ష్మ తరహా పరిశ్రమలు సుమారు 20వేల వరకు ఉండగా, నాలుగు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. గుండు పిన్నుల నుంచి మిసైల్ కాంపొనెంట్ల వరకు ఇక్కడ తయారవుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ మెటీరియల్, ప్యాన్ కంపెనీలు, ఆటో మొబైల్ ఉత్పత్తులు, డిఫెన్స్ వర్కులు, కోల్డ్ ప్రాసెసింగ్, గేర్లు, మధ్యంతర తయారీ వస్తువులను తయారవుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వే తీవ్రతతో సూక్ష్మతరహా పరిశ్రమలకు ఆర్డర్స్ తగ్గడంతో నష్టాల్లో ఉన్నాయి.

ఉత్పత్తిపై ప్రభావం…

కరోనా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమను కుదుపేస్తోంది. పరిశ్రమలకు చెందిన నిర్వహకులు, కార్మికులు ఆర్డర్స్ కోసం, పెద్ద పరిశ్రమల్లోని యంత్రాల మరమ్మతులకు వెళ్తుంటారు. అదే విధంగా ట్రాన్స్ పోర్టు, మెటల్ సప్లయి, కస్టమర్స్ తో నిత్యం మాట్లాడుతుంటారు. ఈ సమయంలో కరోనా సోకుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మృత్యువాత పడుతుండటంతో పరిశ్రమలు మూతపడటం, కార్మికులకు సైతం కరోనా భయంతో పరిశ్రమలకు రాకపోవడంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదీలా ఉంటే రా మెటీరియల్ ఇనుము,అల్యూమినియం, ప్లాస్టిక్ పాలీ ప్రొపిలీన్, హెచ్డీపీఈ, పీవీసీ, ఏబీసీ మెటీరియల్ ధరలు కిలో రూ.40 నుంచి 60 వరకు పెరగడంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

కార్మికులు మృత్యువాత

బాలానగర్ డివిజన్లోని శోభనాకాలనీ, ఫతేనగర్, అక్షయ ఎన్ క్లేవ్, గౌతంనగర్, నవజీవననగర్, గీత నగర్, వినాయకనగర్, మాధవినగర్, ప్రశాంతినగర్, గాంధీనగర్, జీడిమెట్ల లో 4200 పరిశ్రమలు, చర్లపల్లిలోని కుషాయిగూడ, బీఎన్ రెడ్డినగర్, మౌలాలిల్లో 1500, కాప్రా డివిజన్ లో2000, పటాన్ చెరువులో 600 పరిశ్రమలు ఉన్నాయి. బాలానగర్ డివిజన్ లో 48 మందికి కరోనా రాగా 12 మంది మృతి చెందారు. మృతుల్లో దీపక్( శోభనాకాలనీ), ఆంజనేయులు(శోభనాకాలనీ), బాలయ్య(శోభనాకాలనీ), రమేష్, శేఖర్ రెడ్డి, ప్రసాద్(గౌతంనగర్), సతీష్, అబ్దుల్లా(బాలానగర్), రాము, శ్రీను( ఫతేనగర్), సుధాకర్ (మాధవినగర్), సుధాకర్( వినాయక నగర్, జీడిమెట్ల) ఉన్నారు. పటాన్ చెరువులో యాబై మందికి పైగా కోవిడ్ సోకగా ఆరుగురు మృతి చెందారు. కాంతారెడ్డి, మాణిక్యం, సురేష్, సత్యనారాయణ, శేఖర్ తో పాటు మరొకరు ఉన్నారు. అదే విధంగా చర్లపల్లిలో పలువురికి కరోనా రాగా 12 మంది, కాప్రా డివిజన్ లో 12 మంది మృతి చెందారు. వీరంతా ఎంఎస్ఎంఈ పరిశ్రమల నిర్వహకులే. ఇవి తెలిసిన వివరాలు మాత్రమే.

వ్యాక్సినేషన్ పై సందిగ్ధత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు, వాటిల్లో పనిచేసే కార్మికులకు టీకాపై స్పష్టతనివ్వలేదు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి టీకా వేస్తున్నప్పటికీ ఇండస్ట్రీ గురించి ప్రస్తావించలేదు. చిన్నతరహా పరిశ్రమలు కేవలం ఇద్దరు లేదా నలుగురితో పనిచేసేవి. అయితే కరోనా నేపథ్యంలో ఫస్ట్ వేతో గతేడాది కాలంగా అర్డర్స్ లేక పోవడంతో తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. సెకండ్ వేతో కొంతమంది నిర్వహకులు నడపలేక మూసివేశారు. అయితే పరిశ్రమల నిర్వహకులు ప్రైవేటు ఆసుపత్రులతో సంప్రదింపులు చేసుకొని పారిశ్రామిక వాడల్లో క్యాంపులు నిర్వహించాలంటే ఖర్చుతో కూడుకున్న అంశం.

అసలే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చిన్న పరిశ్రమల యజమానులు మళ్లీ టీకా కోసం వేల రూపాయలు వెచ్చించే టీకా వేయించే పరిస్థితి లేదు. దీంతో పరిశ్రమల నిర్వహకులతో పాటు కార్మికులు సైతం షాపులకు వచ్చి పనిచేయాలంటేనే జంకుతున్నారు. ప్రభుత్వం పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు యజమానులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి టీకా వేయాలని పలువురు ఎంఎస్ఎంఈ నిర్వహకులు కోరుతున్నారు.

ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం లేదు

ఏ పరిశ్రమ అయినా ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలంటే 15 మంది కార్మికులు ఉండాలి. అయితే చిన్నతరహా పరిశ్రమలు కేవలం ఇద్దరు నుంచి నాలుగురు కార్మికులు మాత్రమే పనిచేస్తారు. వాటికి ఈ సదుపాయాలకు అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ రావడం లేదు. ప్రభుత్వం చిన్నపరిశ్రమలను కూడా గుర్తించి సదుపాయాలను కల్పించి ఆదుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి

Srinivas

ఇండస్ట్రీ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి. కరోనాతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలే గిరాకీలు లేవు. ఆర్థికంగా చితికిపోయారు. ఈనేపథ్యంలో కరోనా సోకితే చికిత్స చేయించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి వారియర్స్‌గా గుర్తించి ఒనర్స్‌కు, కార్మికులకు టీకా వేసి వారిలో మనోధైర్యం కల్పించాలి.
– నీర్లకంటి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ, కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్

దుకాణం తెరవాలంటేనే జంకుతున్నారు..

Sunil

కరోనా సెకండ్ వే తీవ్రంగా ఉండటంతో బాలానగర్ డివిజన్ లోనే 48 మంది యజమానులకు కరోనా సోకగా 12 మంది మృతి చెందారు. అసలే ఆర్డర్స్ లేవు. దీనికి తోడు కరోనాతో మృత్యువాత పడుతుండటంతో చిన్నతరహా పరిశ్రమ యజమానులు షాపులను తెరవాలంటేనే జంకుతున్నారు. పరిశ్రమలు గట్టేక్కాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని యజమానులతో పాటు కార్మికులకు టీకా వేయాలి. రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి. పరిశ్రమ నిర్వహకుల్లో భరోసా కల్పించాలి. ఇద్దరు నుంచి నలుగురు కార్మికులు పనిచేసే పరిశ్రమలకు కూడా ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సూక్ష్మ తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి.
– సునీల్ కుమార్, అధ్యక్షుడు, బాలానగర్ సూక్ష్మ, చిన్న పరిశ్రమల అసోసియేషన్

Advertisement

Next Story