పోలీసులే రచయితలుగా.. ‘సెల్యూట్’ బుక్

by Sujitha Rachapalli |
పోలీసులే రచయితలుగా.. ‘సెల్యూట్’ బుక్
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా స్టోరీలైనా, పుస్తకాల్లోని కథలైనా.. గాల్లోంచి పుట్టవు. మన చుట్టూ ఉన్న సమాజంతో పాటు జరిగిన, జరుగుతున్న సంఘటనలు, వ్యక్తుల నుంచే ఉద్భవిస్తాయి. అలా ఓ 20 మంది పోలీసులు తమలోని కథకుడిని నిద్రలేపి.. 20 కథలకు ప్రాణం పోశారు. వాటిని ‘సెల్యూట్’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. కేరళకు చెందిన బి సంధ్య, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. ‘సెల్యూట్’ పుస్తకానికి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించింది. తాను కూడా ఈ పుస్తకంలో ‘వెంబనదింటే విలాపం’ అనే ఓ కథను రాయడం విశేషం. అసలు పోలీసులు రచయితలుగా మారడానికి కారణం.. ఈ పుస్తక పబ్లిషర్ జీవీ రాకేష్.

‘బుక్ పబ్లిషర్‌ (జీవీ బుక్స్)గా ఎంతోమంది ప్రముఖుల పుస్తకాలు ప్రింట్ చేశాను. అయితే, నా దృష్టిలో పోలీస్ శాఖలోనూ చాలా మంది ఎక్సలెంట్ రైటర్స్ ఉంటారు. కానీ వాళ్లకు ఆ అవకాశం రాకపోవచ్చు. అందుకే.. వారిలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. నాకొచ్చిన ఈ ఆలోచనను.. సంధ్య మేడమ్‌తో పంచుకున్నాను. మేడమ్‌కు కూడా నా ఆలోచన నచ్చడంతో.. పోలీస్ మెన్స్, వుమెన్స్‌తో చర్చించాం. పోలీసుల నుంచి స్టోరీలను ఆహ్వానించాం. దాంతో మొత్తంగా 58 స్టోరీలు వచ్చాయి. జీవీ బుక్స్ ఎడిటోరియల్ బోర్డు అందులో నుంచి 28 స్టోరీలను ఎంపిక చేసింది. వాటిని ఫైనల్ సెలక్షన్ కోసం సంధ్య మేడమ్‌కు పంపించాం. మేడమ్ ఉత్తమమైన 20 కథలను ఫైనల్‌గా ఎంపిక చేసింది’ అని రాకేష్ తెలిపాడు.

‘పోలీసులకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎంతో మెరుగ్గా ఉంటాయి. కానీ వాటిని డ్యూటీ పరంగానే కాకుండా నిత్య జీవితంలోనూ అప్లయ్ చేయాలి. క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. గ్రేట్ నావలిస్ట్ జార్జ్ ఆర్వెల్ కూడా.. ఓ పోలీసు అధికారే. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పోలీసు అధికారులు.. పేరున్న రచయితలుగా ఎదిగారు. కేరళలో మా పోలీస్ ఫోర్స్‌లోనూ మంచి రైటర్స్ ఉన్నారు. అందులోని కొంతమంది ‘సెల్యూట్’ పుస్తకానికి కథలు అందించారు. కేరళలో ఈ తరహా పుస్తకం రావడం ఇదే తొలిసారి’ అని సంధ్య తెలిపారు.

సెల్యూట్ పుస్తకంలో.. కొన్ని ఇన్వెస్టిగేటివ్ తరహా కథలు కూడా ఉన్నాయి. నిత్య జీవితంలోని సంఘటన ఆధారంగా కొన్ని, ఇతర జానర్లలో కొన్ని కథలున్నాయి. కాగా ఈ పుస్తకం.. అక్టోబర్‌లో మార్కెట్‌లో విడుదల కాబోతుంది.

Advertisement

Next Story