మురికివాడ పిల్లలకు.. ఉపాధ్యాయులుగా మారిన పోలీసులు

by Shyam |
మురికివాడ పిల్లలకు.. ఉపాధ్యాయులుగా మారిన పోలీసులు
X

దిశ, ఫీచర్స్ : కరోనా థర్డ్‌వేవ్ భయాలతో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోలేదు. అయితే ఆన్‌లైన్ క్లాసెస్ కొనసాగుతున్నా.. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేని పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కోల్‌కతాలోని మజెర్‌హట్ రైల్వే స్టేషన్ సమీప కాలనీలోని పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుండగా.. ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ గార్డ్ ఇన్‌చార్జ్ ప్రాన్‌సెంజిత్ చటర్జీ వారి కోసం రెగ్యులర్ క్లాసులు ఏర్పాటు చేశాడు.

మజెర్‌‌హట్ సమీప నివాసితులంతా దినసరి కూలీలే కాగా.. కొవిడ్ -19 ఆంక్షలు ఆ కుటుంబాల పరిస్థితిని దయనీయంగా మార్చాయి. తమ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేని దీనస్థితిని అనుభవిస్తున్న పేరెంట్స్‌కు ట్యూషన్ చెప్పించేంత స్థోమత లేకపోవడం గమనార్హం. అయితే అదే ప్రాంతంలో డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నపుడు కొంతమంది పిల్లలు తామే సొంతంగా చదువుకుంటున్నట్లు గమనించిన చటర్జీ.. వారికి కోచింగ్ క్లాసెస్ ప్రారంభించాలని తన సిబ్బందిని కోరాడు. వాళ్లు కూడా ఓకే చెప్పడంతో రెండు షిఫ్టుల్లో 30 మందికి విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. 1 నుంచి 4వ తరగతి వరకు హిందీ, ఇంగ్లీష్, గణిత సబ్జెక్ట్స్ బోధిస్తుండగా.. స్కూల్స్ రీఓపెన్ అయ్యేవరకు కోచింగ్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ‘పిల్లలకు పాఠాలు బోధించేందుకు మేము ఒక బోర్డు, మార్కర్ పెన్ను ఏర్పాటు చేశాం. కోచింగ్ క్లాస్‌లో భౌతిక దూరంతో పాటు కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాం. ఈ ట్యూషన్ సెషన్.. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తెచ్చిపెట్టింది. ఇది నాకు ఒక విలువైన బహుమతి’ అని చటర్జీ చెప్పారు.

సొంతంగా చదువుకునేందుకు ప్రయత్నించినా ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. మా నాన్న సాయం చేయలేదు. ప్రస్తుతం ఓ లేడీ పోలీస్ చొరవతో ట్యూషన్ క్లాసులు వింటుండటంతో సమస్య తీరింది. కోచింగ్ క్లాస్‌‌కు వెళ్తుంటే స్కూల్‌లో ఉన్నట్లుగానే అనిపిస్తోంది.
– ప్రియాంక, మూడో క్లాస్ విద్యార్థిని

Advertisement

Next Story