చేతులెత్తేసిన ప్రభుత్వాలు..

by Shyam |

– సొంత రవాణా ఏర్పాట్లే గతి
– దిక్కుతోచని స్థితిలో వలస కార్మికులు

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు.. వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో వారి ముఖాలు వికసించాయి.. ఇక సొంతూరుకు వెళ్లొచ్చనే ఆనందంలో వారి పాణం లేచొచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.. కారణం స్వస్థలాలకు వెళ్ళాలనుకునే వలస కార్మికులే సొంతంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉచిత సలహా ఇవ్వడమే. కేంద్ర ప్రభుత్వం, సొంత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం వలసొచ్చి ఉంటున్న రాష్ట్రమూ వీరి రవాణాకు తగిన ఏర్పాట్లు చేయలేమంటూ చేతులెత్తేశాయి. రైళ్ళ ద్వారా తరలించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. బస్సుల ద్వారా దూరాభారం కుదరదని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. దీంతో సొంత ఏర్పాట్లు చేసుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక.. వలస కార్మికులు తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాల తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన’ చందంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. వలస కార్మికుల రాకపోకలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించి ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాను, ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నోడల్ అధికారులుగా నియమించారు. వీరు ఈ విషయంపై కసరత్తు చేసి ఒక ‘రవాణా పాస్‌’ను జారీ చేశారు. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంతంగా రవాణా ఏర్పాట్లు చేసుకొని వెళ్లొచ్చని ఆ పాసుల్లో పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రైళ్ళను ఏర్పాటు చేయాలని, బస్సుల్లో తరలించడం సాధ్యం కాదని చేతులెత్తేశారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులోనూ పలు రాష్ట్రాల అధికారులు సైతం ప్రత్యేక రైళ్ళను నడపాల్సిందిగా సూచించారు. కాగా, బీహార్ ఉప ముఖ్యమంత్రి (బీజేపీ) సుశీల్ మోడీనే.. తొలుత ప్రత్యేక రైళ్ళ ప్రస్తావనను తీసుకురావడం గమనార్హం.

తమిళనాడులో నాలుగు లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని, వీరిని పశ్చిమబెంగాల్, అస్సాం లాంటి దూరప్రాంత రాష్ట్రాలకు రోడ్డుమార్గం గుండా తరలించడం కష్టసాధ్యమని ఆ రాష్ట్ర అధికారి పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ సైతం ప్రధానికి లేఖ రాసి రైళ్ళ ద్వారా తప్ప రోడ్డుమార్గం గుండా తరలించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఉండలేక… వెళ్ళలేక…

వలస కార్మికులకు సొంత వాహనాలను సమకూర్చుకునేంత ఆర్థిక స్థోమత లేదు. దీంతో ఇక్కడ ఉండలేక.. సొంత ఊర్లకు వెళ్ళలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వాహనం అద్దెకు తీసుకుంటే అన్ని సీట్లలో కూర్చుని వెళ్ళడానికి వీలు లేదు. ‘సోషల్ డిస్టెన్స్’ పాటిస్తూ ఒక వాహనంలో మూడో వంతు (సీటుకొకరు చొప్పున) మాత్రమే వెళ్ళాలనే నిబంధన ఉంది. కాగా, వాహనాల కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టే పరిస్థితి వలస కార్మికులకు లేదు. తినడానికి తిండి లేకనే వందల కిలో‌మీటర్ల దూరం నుంచి ఉపాధి కోసం ఇక్కడి దాకా వచ్చిన వలస కార్మికులను సొంత ఏర్పాట్లు చేసుకుని వెళ్ళాలంటూ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారికి వాహనాలు ఏర్పాటు చేసి, భోజన వసతులు కల్పించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొని వారి సొంత ఊళ్లకు తీసుకుపోయి విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.

‘నేను శ్రీకాకుళం వెళ్లాలి. మామూలు రోజుల్లోనే.. మేము రైలులో జనరల్ బోగీలో ఎక్కుతాం. ఇప్పుడు పని లేదు, చేతిలో డబ్బు లేదు. రైలు టికెట్‌కే దిక్కు లేదు. ఇక అద్దెకు వాహనాన్ని పెట్టుకోగలమా? ఈ ప్రభుత్వాలు పాసులిస్తాయట ఏం చేస్కోవాలి? బండి పెట్టి మమ్మల్ని మా ఊళ్లలో దించాలి’. – వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు.

‘వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వమే వారి ఊళ్లకు తీసుకు వెళ్లి వదిలిపెట్టి రావాలి. వారిని సొంత వాహనాలను ఏర్పాటు చేసుకోండని ఆదేశాలివ్వడం చూస్తుంటే వింతగా అనిపిస్తోంది. కూలీ పనికి వచ్చినోళ్లు వెహికిల్స్ ఖర్చును భరించగలరా ? రాష్ట్రం, కేంద్రం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం పక్కనపెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములవడానికి వచ్చిన వలస కార్మకులకు రవాణా, భోజనం, వైద్య సౌకర్యాలు కల్పించాలి. – చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

‘వలస కార్మికులకు పాసులిస్తాం… వారి సొంతానికి వారిని వెళ్లండి’ అని ఏ ప్రభుత్వం చెప్పినా తప్పే. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ఆర్టీసీ బస్సులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాటిని వలస కార్మికులను వారి వారి ఊళ్లలో దించి రావడానికి ఎందుకు వాడరు? ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – శ్రీనివాస్, సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శి

Tags : lockdown, migrant labour, central, telngana, transport passe

Advertisement

Next Story

Most Viewed