కాషాయజెండాకు కాంగ్రెస్ దళం..!

by Shyam |
కాషాయజెండాకు కాంగ్రెస్ దళం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలోకి వలసలపై కాషాయ దళం దూకుడు పెంచింది. అనుకున్నట్లు ముందు కాంగ్రెస్​ నేతలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్​తోపాటు బోనస్​గా అధికార పార్టీలో అసంతృప్తులను రెచ్చగొడుతోంది. టీఆర్​ఎస్​లో మీకేం పదవులు రావని, ఆ పార్టీలో ఉంటే ఉనికి లేకుండా పోతారంటూ చెబుతూ తమ పార్టీలో చేరాలని బీజేపీ నేతలు సూచిస్తున్నారు. ప్రధానంగా తొలి ప్రభుత్వంలో ఏదో పదవి వచ్చి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న వారిని, మంత్రివర్గంలో చోటు లేకుండా ఉన్న వారిని టార్గెట్​గా చేసుకుని కాషాయ దళంలోకి ఆహ్వానిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ..

కాంగ్రెస్​ పార్టీలోని సీనియర్​ నేతల నుంచి యువజన సంఘం వరకు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే సర్వే సత్యనారాయణ పార్టీలో చేరినట్లు ప్రకటించగా..విజయశాంతి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. గ్రేటర్​లో పట్టున్న విక్రంగౌడ్​ కాషాయ కండువా కప్పుకున్నారు. అంజన్​ కుమార్​ కూడా అప్పుడో ఇప్పుడో అన్నట్లుగా ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్ది చాలా రోజుల నుంచి పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, ఎంపీ కొమటిరెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందనే కారణంతో ఇంకా పార్టీలోనే ఉంటున్నారని, ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో త్వరలోనే పార్టీని వీడుతారని కాంగ్రెస్​ నేతలే చెబుతున్నారు.

వీరితోపాటు ఒకప్పుడు రాష్ట్రంలో ఫైర్​బ్రాండ్​గా పేరొంది, కాంగ్రెస్​లో మంతివర్గంలో పని చేసిన వరంగల్​ జిల్లాకు చెందిన కొండా మురళీ, కొండా సురేఖ కూడా కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. టీఆర్​ఎస్​లో ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళి ఆ పార్టీని కాదని బయటకు వచ్చారు. సీఎం కేసీఆర్​పై బహిరంగంగా సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ కాంగ్రెస్​లో చేరారు. అదే జిల్లా నుంచి ఓ మాజీ మంత్రి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొండా దంపతులు కూడా చేరుతున్నట్లు తెలిసింది. ఆ మాజీ మంత్రి కంటే ముందుగా కొండా దంపతులే కాషాయ తీర్థం పుచ్చుకుంటారని భావిస్తున్నారు.

వీరితోపాటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హస్తం పార్టీని వదలనున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్​ను మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలోనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి బీజేపీలోకి రావడం వాయిదా పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అనుకున్నట్లుగానే పీసీసీ పీఠాన్ని రేవంత్​రెడ్డికి ఇస్తే కొండా విశ్వేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​లోనే కొనసాగుతారని, లేకుంటే పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పని చేసి, రాజీనామా లేఖను సమర్పించిన జంగా రాఘవరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన సీనియర్​ నేత, నిజామాబాద్​ జిల్లాకు చెందిన సీనియర్​ నేత, నిర్మల్​ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్​లో కాంగ్రెస్​ పరిస్థితిని చూస్తూ చాలా మంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

టీఆర్ఎస్ నుంచి కూడా..

బీజేపీలోకి టీఆర్​ఎస్​ నుంచీ వలసలు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగలేటి శ్రీనివాస్​రెడ్డితోపాటు ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. కొన్ని రోజులు వేచి చూసి వారూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర బేవరేజెస్​ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ దేవీ ప్రసాద్​తోపాటు ఓ మాజీ మంత్రి కూడా టీఆర్​ఎస్​కు షాక్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన ఓ మైనార్టీ నేత కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మైనార్టీలకు బీజేపీలో చాలా అవకాశాలుంటాయని చెప్పేందుకే ఆ మైనార్టీ నేతను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed