ఆధారాలతో కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్.. పోలీసుల్లో ఆందోళన!

by Sridhar Babu |
ఆధారాలతో కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్.. పోలీసుల్లో ఆందోళన!
X

మే 26వ తేదీ.. అన్ని పోలీస్ స్టేషన్లలో లెక్క చూసుకున్నట్టుగానే ఆ ఠాణాలోనూ కస్టడీలో ఉన్న వారి గురించి ఆరా తీశారు. ఓ నిందితుడు కనిపించకపోవడంతో అతని గురించి వెతికారు. బాత్రూంలో శవమై కనిపించాడు. చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. ఠాణాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని కుటుంబ సభ్యులు, పోలీసులు ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఆ తరువాతే ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడా మరణం ఖాకీలను వదిలేసి రాజకీయ రంగు పులుముకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య బాహాటంగా విమర్శించుకునే స్థితికి చేరింది.

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం రామయ్యపల్లికి చెందిన రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు వేట కేసులో అదుపులోకి తీసుకోగా మే 26న చనిపోయాడు. రంగయ్యది ఆత్మహత్యేనని పోలీసులు ప్రకటించగా అతని కుటుంబ సభ్యులు కూడా వేట వద్దన్నా వినలేదు, ఆయన మరణంపై అనుమానాలు లేవు అని చెప్పారు. అయితే అదే రోజున మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కస్టోడియల్ డెత్స్ పెరిగిపోయాయని, మంథని ఠాణాలో రంగయ్య కూడా చనిపోయాడని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల తరువాత పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… శ్రీధర్ బాబుపై ఎదురు దాడికి దిగారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి మూడు గంటల్లో మంథనికి చేరే అవకాశం ఉన్నా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంథని మధుకర్ హత్య కేసును కూడా ఇదే విధంగా వాడుకుని గెలిచాడని ఆరోపించారు. దళితులను ఓట్ల కోసం వాడుకుంటున్నారని కూడా శ్రీధర్ బాబపై పుట్ట మధు ఫైర్ అయ్యారు. మరునాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట మధుపై ఆరోపణలు గుప్పించారు. శ్రీధర్ బాబు దళితులను వాడుకునే వ్యక్తి కాదని, ఆయన వల్లే దళితులు లీడర్లయ్యారని స్పష్టం చేశారు. పుట్ట మధుపై కూడా విమర్శలు గుప్పించారు. తిరిగి పుట్ట మధు కౌంటర్ స్టేట్ మెంట్ ఇస్తూ శ్రీధర్ బాబు తండ్రి హత్యోదంతంపై కామెంట్ చేశారు. ఓ వైపున జిల్లా స్థాయిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు రంగయ్య మృతిపై స్టేట్‌మెంట్లు ఇచ్చుకుంటూనే ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రామయ్యపల్లికి వెళ్లి రంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా రంగయ్య మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తిరిగి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎంపీ వెంకటేశ్ నేతలు నేరుగా రామయ్యపల్లికి వెళ్లి రంగయ్య కుటుంబంతో మాట్లాడి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎల్పీ నేత భట్టీ తీరును తప్పు పట్టారు.

పోలీసుల నుంచి స్పందనేదీ?

రంగయ్య మృతి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ రంగు అంటుకున్న రంగయ్య మృతి విషయంలో ఏం జరిగింది? పోలీసుల వైఖరే కారణమా లేదా అన్న విషయం పక్కకు పోయింది. రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రంగయ్య శవమై స్టేషన్ బాత్రూంలో తేలిన రోజు మినహా ఇప్పటి వరకు పోలీసులు మాత్రం కామెంట్ చేయడం లేదు. అసలేం జరిగింది అన్న కోణాన్ని విస్మరించిన రాజకీయ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నా కూడా ఇప్పటి వరకు పోలీసులు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. రంగయ్య చనిపోయింది ఠాణా ఆవరణలోనే కాగా, పోలీసుల అదుపులో ఉన్నప్పుడే జరిగిన ఘటన అయినందున పోలీసు అధికారుల నుంచి స్పందనా లేకపోవడం కాదు స్పష్టత కూడా రావడం లేదు. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాత్రం రంగయ్య మృతిని రచ్చరచ్చ చేసేశారు.

కీలక విషయాలపై కాంగ్రెస్ నజర్

రంగయ్య చనిపోయిన తరువాత అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రకటన తరువాత చల్లబడ్డట్టే కనిపించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో కాంగ్రెస్ పార్టీ టెక్నికల్ గా పావులు కదపాలని నిర్ణయించుకుంది. అడ్వకేట్ కూడా అయిన శ్రీధర్ బాబు ఇప్పుడు జరిగిన తప్పిదాలపై దృష్టి సారించారు. లోపాలను కూడా ఇప్పటికే సేకరించిన ఆయన క్రిమినల్ లాయర్స్‌తో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. సాంకేతికంగా జరిగిన మిస్టేక్స్‌ను ఎత్తి చూపుతో కేసు వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ఈ మరణం కాస్తా పోలీసుల మెడకు చుట్టుకోక తప్పేలా లేదా అన్న చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలీసు శాఖలో కూడా ఈ విషయంపై అంతర్గతంగా చర్చించి శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయంపై కూడా ఆలోచించారన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఓ మరణం ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల నోళ్లలో నానుతుంటే అటు ఇటు పోయి ఆ ఉచ్చులో బలి ఎవరవుతారన్న విషయంపై పోలీసుల్లో చర్చకు దారి తీసింది. ఠాణాలో చనిపోయిన శీలం రంగయ్య ఎవరి శీలాన్ని తప్పు పడుతుందోనన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి.

Advertisement

Next Story