గోవా చేరిన సోనియా, రాహుల్

by Anukaran |   ( Updated:2020-11-20 11:39:41.0  )
గోవా చేరిన సోనియా, రాహుల్
X

పనాజీ: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీతో గోవా చేరుకున్నారు. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులున్న ఆమె ఢిల్లీలోని కలుషిత వాయువులు, వాతావరణం నుంచి ఊరట కోసం ఇక్కడకు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వైద్యుల సలహా మేరకు ఆహ్లాదకర వాతావరణంలో కొన్నాళ్లు గడపడానికి దక్షిణ గోవాలోని ఓ రిసార్టులో దిగారని వివరించాయి. ప్రైవేటు విజిట్‌లో గోవా చేరిన సోనియా రాజకీయ నేతలతో భేటీలు, సంప్రదింపులేవీ జరపరని పేర్కొన్నాయి. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఈ ఏడాది దాదాపుగా చికిత్సకే పరిమితమయ్యారు. మే నెలలో అబ్రాడ్ వెళ్లొచ్చిన ఆమె ఆగస్టు 2నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాంగ్రెస్ ప్యానెల్‌లో నలుగురు అసమ్మతిదారులు..

గోవాకు బయల్దేరడానికి ముందు కాంగ్రెస్ అంతర్గతపోరు మరింత రచ్చకెక్కకుండా నివారించే నిర్ణయాన్ని సోనియా గాంధీ తీసుకున్నారు. దేశ భద్రత, విదేశాంగ వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థలపై ఏర్పాటు చేసిన మూడు కమిటీల్లో నలుగురు అసమ్మతిదారులకూ స్థానం కల్పించి ఇమేజ్ డ్యామేజీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మూడు కమిటీల్లో మన్మోహన్ సింగ్ ఉండగా, ఒక కమిటీలో చిదంబరం, రెండో కమిటీలో ఇద్దరు అసమ్మతిదారులు ఆనంద్ శర్మ, శశిథరూర్, మూడో కమిటీలో గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీలను ఎంపిక చేశారు. కపిల్ సిబల్‌కు సపోర్ట్ చేసి పి చిదంబరం కూడా అసమ్మతిదారుల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story