బ్రోకర్లు, జోకర్లను ఉసిగొల్పుతున్నారు: రేవంత్

by Shyam |
బ్రోకర్లు, జోకర్లను ఉసిగొల్పుతున్నారు: రేవంత్
X

దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్‌ తనపై మిడతలదండు, బ్రోకర్లు, జోకర్లను ఉసిగొల్పుతున్నారంటూ మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుందని విమర్శించారు. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు నాకు అర్థరాత్రి ఫోన్ చేసినా నేరుగా వట్టినాగులపల్లిలోని మా భూముల దగ్గరకు వస్తానని, అక్కడ పూచికపుల్ల ఉన్నా వెంటనే జేసీబీలతో నేలమట్టం చేద్దామన్నారు. తర్వాత నేరుగా జన్వాడ వెళ్లి అక్కడ ఫామ్‌హౌస్ విషయాన్ని తేలుద్దామని ఈ సవాల్‌కు సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపించిన రేవంత్, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. కేటీఆర్ లీజుకు తీసుకున్నాడని బాల్కసుమన్ చెబితే, అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్ ట్వీట్ కూడా చేశాడని రేవంత్ గుర్తుచేశారు. డ్రోన్ కేసులో తనను అరెస్ట్ చేసినప్పుడు మంత్రి కేటీఆర్ అక్కడ ఉంటున్నారని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారని తెలిపారు.

జన్వాడ ఫాంహౌస్‌ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందని, 301 సర్వే నెంబర్లలో కేటీఆర్‌ సతీమణి పేరిట 3ఎకరాల భూమి ఉందన్నారు. భూములు లేవని కేటీఆర్‌ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనని, తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. వట్టినాగులపల్లి లో తనకు 22గుంటలు, తన బామ్మర్ధికి 20గుంటలు భూమి ఉందని అక్కడ ఒక్క ఇంచు నిర్మాణం ఉన్నా కూల్చివేసేందుకు రెడీ అన్నారు. కేటీఆర్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని లేకుంటే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. 1990లో తన శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు అదేశించగా బాధ్యత వహిస్తూ అప్పటి మంత్రి కోనేరు రంగారావు మున్సిపల్‌ శాఖ మంత్రి పదవి కి రాజీనామా చేశారని, విచారణలో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేలిన తర్వాతే మళ్లీ మంత్రి పదవి తీసుకున్నారన్నారు.

కరోనా కేసులు పెరగడం బాధాకరం: వీహెచ్

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత రోజురోజుకు కరోనా కేసులు పెరగడం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. గుళ్లు, హోటల్స్, మాల్స్ అన్ని తెరిస్తే మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల ప్రాణాల కంటే ఆదాయమే ముఖ్యం అయిందన్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లు, వాటర్ బిల్లులు రద్దు చేయాలని, అసదుద్దీన్ కూడా దీనిపై సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని వీహెచ్ కోరారు. కాగా కరోనా తో మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి తన వంతుగా రూ. 25వేల ఆర్థిక సహాయం అందిస్తున్నానని వీహెచ్ ప్రకటించారు.

Advertisement

Next Story