మెచ్చా క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ సభ్యులు రాళ్లతో దాడి..

by Sridhar Babu |
mechha
X

దిశ, అశ్వారావుపేట టౌన్: అశ్వారావుపేట టిఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంపై బుధవారం యూత్ కాంగ్రెస్ సభ్యులు రాళ్లతో దాడి చేసి, యూత్ కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన ఘటనపై దిశ దినపత్రికతో మాట్లాడిన ఎమ్మెల్యే మెచ్చా ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడం తప్పుకాదని, కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని. వివాదాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండే తన పై తీవ్రపదజాలంతో దూషణలకు దిగి క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు.

ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే టిఆర్ఎస్ పార్టీలో చేరానని, పార్టీ మారడంపై రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గత చరిత్ర కూడా తెలుసుకోవాలని, అధికార పార్టీలో ఉన్నప్పటికీ దాడి ఘటనపై సంయమనం పాటించడం టిఆర్ఎస్ పార్టీలోని క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన దుశ్చర్యను సభ్యసమాజం హర్షించడం లేదని, నాపై ఆరోపణలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే అభాసు పాలయ్యారని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళతానని ధీమా వ్యక్తం చేశారు. భౌతిక దాడుల విష సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చూస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed