రేవంత్ రాకతో ఉరకలేస్తున్న ఉత్సాహం.. ఇక సమరమేనా..!

by Aamani |   ( Updated:2021-07-13 02:44:51.0  )
రేవంత్ రాకతో ఉరకలేస్తున్న ఉత్సాహం.. ఇక సమరమేనా..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సమస్యలపై సమరం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల్లేవు. అన్యాయాలపై నిలదీసే నిరసనలు కనిపించడంలేదు.. అవినీతి, అక్రమాలపై ఆందోళనలు అంతంత మాత్రమే.. నడిపించే నాయకత్వం లేదు.. సమర్థవంతమైన స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణులు.. ఏడేళ్లుగా నిరాశ, నిస్పృహ, నిస్తేజం వారిలో నెలకొంది. అలాంటిది ఇంతలోనే ఎంతో మార్పు కనిపిస్తోంది. టీపీసీసీ కొత్త సారథిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవటం, నిర్మల్ జిల్లా నుంచి నిరసన బాట పట్టడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన మహాధర్నా విజయవంతం కావటంతో క్యాడరులో ఫుల్ జోష్ కనిపిస్తోంది. పోరుబాటకు తూర్పు నుంచి శ్రీకారం చుట్టిన కొత్త సారథికి కలిసి వస్తుందో ఆపై కాలమే నిర్ణయించాలి.

కాంగ్రెస్ పార్టీలో కదనోత్సాహం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచిరోజులు వస్తాయా.. టీపీసీసీ కొత్త రథ సారథి రేవంత్ రెడ్డికి సెంటిమెంట్లు కలిసి వస్తాయా.. ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా..? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. తాజా పరిణామాలు, పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణుల్లో మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ నూతన ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తోంది. కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్లో చేపట్టిన మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనగా.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావటం ఆ పార్టీ నాయకత్వం, శ్రేణుల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం నింపింది. ధర్నా విజయవంతం కావటంతో క్యాడరులోనూ కదనోత్సాహం కనిపిస్తోంది.

నిరసన బాట కలిసొచ్చేనా..?

టీపీసీసీ బాధ్యతలు తీసుకున్నాక క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రేవంత్ తొలిసారిగా నిర్మల్ జిల్లా నుంచి నిరసన బాట పట్టారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. అని బండి యాదగిరి రాసిన పాట, గద్దర్ అన్న పాడిన పాట స్ఫూర్తితో తాను తూర్పున ఉన్న నిర్మల్ నుంచి పోరుబాటకు శ్రీకారం చుట్టామని.. తాము పూర్తి సఫలీకృతులం అవుతామంటూ రేవంత్ రెడ్డి సెంటిమెంట్ మాటలు తెరపైకి తెచ్చారు. నిర్మల్ నుంచి చేపట్టిన నిరసన బాట అటు రేవంత్ రెడ్డికి, ఇటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. మరోవైపు కేసీఆర్ లక్కీ నెంబరు 6, నా లక్కీ నెంబరు 9, నిర్మల్ నియోజకవర్గం నెంబరు 9.. అందుకే తొలి నిరసన కార్యక్రమం ఇక్కడి నుంచి చేపట్టినందున కేసీఆర్ నెంబరు తిరగేస్తే 9 అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో అదే పునరావృతమై తమకు కలిసి వస్తుందనే అంకెల లెక్కలు చెబుతున్నారు పార్టీ శ్రేణులు. మొత్తానికి ఆయన చేసే విమర్శలు, పోరుబాట, సెంటిమెంట్ మాటలు పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతున్నాయనే చర్చ మొదలైంది.

కాంగ్రెస్ శ్రేణుల్లో మార్పు తథ్యమా..?

టీపీసీసీ కొత్త రథసారథి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో మార్పు మొదలైనట్టే అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం, స్థానిక మంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించటంతో పాటు పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఆయన మాటలు, తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ మెతక వైఖరి కొనసాగించగా.. తాజాగా దూకుడుగా వ్యవహరించటంతో పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెరుగుతోంది. స్థానిక సమస్యలపై గళం విప్పటంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడుతుండటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. కాంగ్రెస్‌లోని కోవర్టులు, ఇంటి దొంగలను వదలమని నెలాఖరులోగా బయటకు వెళ్లాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు రేవంత్. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను తమ గుండెల్లో పెట్టుకుంటామనే భరోసా, అండ ఇవ్వటంతో పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకొస్తున్నారనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. గతానికి భిన్నంగా సమర్థవంతమైన యువ నాయకత్వం, నిరసనలతో జనాల్లోకి వెళ్తుండటంతో పార్టీ శ్రేణులకు మళ్లీ పునరుత్తేజం ఇచ్చినట్లయింది. మొత్తానికి రేవంత్ రెడ్డి నాయకత్వం, మహాధర్నాతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ నింపినట్టు అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed