రేవంత్‌కు షాకిచ్చిన సీనియర్లు.. సభకు డుమ్మా

by Shyam |   ( Updated:2021-08-09 22:48:39.0  )
రేవంత్‌కు షాకిచ్చిన సీనియర్లు.. సభకు డుమ్మా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్​పార్టీ కదనరంగంలోకి దూకింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్​శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇక అనుకున్నట్టే సీనియర్లు గైర్హాజరయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, చిన్నారెడ్డిలు దళిత దండోరాకు వెళ్లలేదు. సభ సక్సెస్​ అయిందనే అంశం ఓ వైపు ఉంటే సీనియర్ల గైర్హాజరు పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సభకు రానివాళ్లంతా కేసీఆర్​ కోవర్టులే అనే సంకేతాలను టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లు వెళ్లకపోవడం మరోసారి వివాదంగానే మారుతోంది.

ఏం చేస్తారు..?

కాంగ్రెస్​ పార్టీ ఇంద్రవెల్లి సభపై భారీ ఆశలు పెట్టుకుంది. ఊహించినదాకంటే ఎక్కువగా సభ సక్సెస్​ అయింది. మరోవైపు దళిత దండోరాను విజయవంతం చేసే బాధ్యతలను సీనియర్లంతా భుజాలపై వేసుకున్నారు. టీపీసీసీ చీఫ్​పై అలిగిన పలువురు అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్​ నుంచి బయలుదేరిన రేవంత్​ వెంట సీఎల్పీ భట్టి విక్రమార్కతో పాటు పలువురు తరలి వెళ్లారు. మరికొంతమంది సీనియర్లు రెండు రోజుల నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు ఈ సభకు ముందు నుంచే కాంగ్రెస్​లో చాలా విమర్శలు వచ్చాయి. దళిత దండోరా ఎందుకు పెడుతున్నారంటూ ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్​ ఏలేటీ మహేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు. కానీ పార్టీ నేతలు ఆయన్ను బుజ్జగించారు. మరోవైపు ఏఐసీసీ నుంచి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు వచ్చింది. స్వయంగా రాహుల్​ గాంధీ ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుంటూ గో హెడ్​ చెప్పడంతో పార్టీ నేతలు కూడా కలిసిరావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో రేవంత్​రెడ్డి కూడా ఆయా సందర్భాల్లో పార్టీ సీనియర్లకు చురకలంటిస్తూనే ఉన్నారు. ఈ సభ ద్వారా పార్టీకి విధేయులెవ్వరో, కేసీఆర్​ కోవర్టులెవ్వరో తేలిపోతుందంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన పార్టీలో మరింత ప్రాధాన్యతను పెంచింది.

వారెందుకు వెళ్లలేదు

ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా పార్టీలో కొత్త ఊపు తెచ్చింది. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు ఉన్నఫళంగా నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక ఇంద్రవెల్లి గడ్డపై రేవంత్ రెడ్డి మోగించిన దండోరా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో కదలిక తెచ్చినట్లు అయింది. దళిత బిడ్డలం కాకపోయినా నల్లమల అడవుల్లో పుట్టిన బిడ్డనని, అన్నగా, కొడుకుగా, ఇంట్లో ఒక్కడిగా జీవితకాలం మీ కోసం పని చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు మీ కోసం పని చేశానన్న ఆనందంతో కళ్ళు మూస్తానని రేవంత్ రెడ్డి ఉద్వేగంతో చేసిన ప్రసంగం కాంగ్రెస్ శ్రేణులను మరింత రెచ్చగొట్టింది. అంతేకాకుండా ఇది నాయకులు పార్టీ కాదని ఇక నుంచి కార్యకర్తల పార్టీ అని ఇంద్రవెల్లిలో జరిగిన సభా నాయకులు విజయం కాదని కార్యకర్తలు కృషి ఫలితమేనని, ఇక సోనియమ్మ రాజ్యమని తెలంగాణ తల్లి అంటే సోనియాగాంధీ అంటూ మరోసారి స్పష్టం చేశారు.

ఇదంతా ఒకవైపు ఉంటే కాంగ్రెస్​ సీనియర్లు కొందరు దూరంగా ఉన్నారు. టీపీసీసీ అంశంలో రేవంత్​రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్​రెడ్డి సభకు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​ కూడా వెళ్లకపోవడం కొంత చర్చగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్​ వెళ్లరని ముందుగానే ఊహించినప్పటికీ.. ఉత్తమ్​ కూడా హాజరుకాకపోవడం పార్టీ నేతల్లో కొంత ఆశ్చర్యంగానే మారింది. కౌశిక్​రెడ్డి వ్యవహారం తర్వాత ఉత్తమ్​ మరింత అలిగినట్లు పార్టీ నేతల్లో టాక్​. అయితే 2014 తర్వాత కాంగ్రెస్​ పార్టీ ఏర్పాటు చేసిన ఈ దళిత దండోరా బహిరంగసభ విజయవంతం కావడం ఒక పరిణామం అయితే ఉత్తమ్​ సహా పలువురు వెళ్లకపోవడం ఒకింత చర్చ​ అవుతోంది. అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి కూడా వెళ్లలేదు. అయితే తనకు అనారోగ్యంగా ఉందంటూ జగ్గారెడ్డి రెండు రోజుల కిందటే ప్రకటన ఇచ్చారు. ఇక పీసీసీ మాజా అధ్యక్షుడు వీహెచ్​ కూడా హాజరుకాలేదు. అయితే గత నెలలో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఇటీవలే ఇంటికి చేరారు. ఇంటి నుంచే ప్రెస్​మీట్లు నిర్వహిస్తున్నారు. ఆయన రాకపోవడానికి అనారోగ్యమే కారణమంటున్నారు.

వచ్చేనెల 17 వరకూ దళిత దండోరా

ఇంద్రవెల్లి సభకు ముందు కాంగ్రెస్​ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వచ్చేనెల 17 వరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్​ నియోజకవర్గాలు కవర్​ అయ్యేలా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అధిష్టానం ఆదేశాలతో రేవంత్​రెడ్డి ఈ సభలను ఖరారు చేస్తున్నారు. ఇంద్రవెల్లి నుంచి మొదలవుతున్న దళిత, గిరిజన దండోరాను రాష్ట్రమంతా నిర్వహించనున్నారు. గిరిజనులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దళిత సమస్యలను టార్గెట్​గా తీసుకుని భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ఆయా పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా నేతలకు ప్రత్యేకంగా విధులు అప్పగిస్తున్నారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి రాష్ట్రంలో చేపట్టే పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వచ్చేనెల 17 వరకు చేపట్టే దళిత, గిరిజన దండోరా కార్యక్రమానికి రాహుల్​ గాంధీ రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇంకా తేదీ ఖరారు చేయాల్సి ఉంది. అయితే రేవంత్​రెడ్డి పాదయాత్రపై రాహుల్​ గాంధీ నుంచే ప్రకటన చేయించాలని రేవంత్​రెడ్డి భావిస్తున్నారు. ఈ దండొరా సభలు ముగిసన తర్వాత పరిస్థితులను అంచనా వేసుకుని పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed