‘హరీష్ రావు మనిషికి కాంగ్రెస్ టికెట్’.. వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2021-10-03 08:56:19.0  )
‘హరీష్ రావు మనిషికి కాంగ్రెస్ టికెట్’.. వీడియో వైరల్
X

దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ బైపోల్‌లో ఆ రెండు పార్టీలకు ధీటైన పోటీ ఇచ్చేది మేమేనంటూ ప్రకటించుకున్న కాంగ్రెస్‌కు.. ఆదిలోనే హంసపాదు ఎదురయింది. అభ్యర్థి ఎంపికపై హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. స్థానికులను కాదని పక్క నియోజకవర్గం నుంచి అరువు తెచ్చి.. పోటీ చేయించడం పట్ల సీనియర్లు అసమ్మతి రాగమందుకుంటున్నారు. దీంతో, బలమైన సామాజికవర్గం నుంచి యువ నేతను బరిలోకి దించామంటూ సంబురపడుతున్న టీపీసీసీ నేతలకు కొత్త తలనొప్పి మొదలైంది.

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆ పార్టీ నేతలు మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవలే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగా.. పార్టీలో వచ్చిన నయా జోష్‌తో ఆశావహుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో టికెట్ ఆశిస్తున్న వారు దరఖాస్తు రుసుము చెల్లించాలంటూ పీసీసీ తెచ్చిన కొత్త నిర్ణయానికి కూడా వెనుకాడలేదు. పదుల సంఖ్యలో నాయకులు కాంగ్రెస్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని పేర్కొంటూ పీసీసీతో పాటు ఏఐసీసీకి కూడా దరఖాస్తు చేసుకున్నారు.

స్థానిక నేతలను బరిలోకి దించుతామంటూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రకటనలు చేశారు. ఇందుకు తగ్గట్లుగానే స్థానిక నేతలైన స్వర్గం రవి, ప్యాట రమేష్ లాంటి వారితో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు ధీటుగా కాంగ్రెస్ నిలువబోతుందనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొనగా, ముక్కోణపు పోటీ తప్పదేమోననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ రావు‌ను అభ్యర్థి‌గా ప్రకటించడాన్ని ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తమను కాదని పక్క సెగ్మెంట్‌కు చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం వెనుక టీఆర్ఎస్ పెద్దల హస్తముందంటూ, ప్రకటించిన అభ్యర్థి మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్యాట రమేష్ ఆరోపించారు. అధికార టీఆర్ఎస్‌తో తామిక్కడ బరి గీసి కొట్లాడుతుంటే, రాష్ట్ర స్థాయిలో కుమ్ముక్కైనట్లుగా వ్యవహరించటం అనుమానాలకు తావిస్తుందంటున్నారు. తాము ఏళ్ళ తరబడి కుటుంబాలకు దూరమై, ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పని చేస్తే.. ఇతరులకు టికెట్ కేటాయించడం పట్ల తీవ్ర స్థాయిలో విభేదిస్తూ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పార్టీనే నమ్ముకుని ముందుకు సాగుతున్న తమను పీసీసీ అగ్ర నాయకులు నట్టేటముంచారంటూ మండిపడుతున్నారు. టికెట్ కేటాయింపులో అధిష్టానం తీసుకున్న నిర్ణయం బడుగు, బలహీన వర్గాలను అవమాన పర్చడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతల తీరుపై స్థానిక నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ప్రచారానికి కూడా వెళ్ళేది లేదంటూ అలకబూనారు. దీంతో.. నిన్నటి దాకా జోష్‌లో ఉన్న ఆ పార్టీ లోకల్ కేడర్.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అయోమయానికి గురవుతుంది. అధిష్టానం కలుగజేసుకుని అసమ్మతి చల్లార్పుతుందా లేక క్రమశిక్షణ చర్యలు దిగుతుందో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed