నేడు కమలం గూటికి విజయశాంతి

by Shyam |
నేడు కమలం గూటికి విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి విజయశాంతి ఎట్టకేలకు కమలం గూటికి చేరనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో ఆదివారం సాయంత్రం ఆమె భేటీ అయ్యారు. పార్టీలో పోషించాల్సిన పాత్రపై చర్చించారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తదితరులు సైతం అమిత్ షాతో విజయశాంతి భేటీ సందర్భంగా అక్కడే ఉన్నారు.

20 ఏండ్ల తర్వాత

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్ఎస్ ఎంపీగా క్రియాశీలక పాత్ర పోషించిన విజయశాంతి సుమారు 20 ఏండ్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. 1990వ దశకం చివర్లో బీజేపీ మహిళా మోర్చాలో యాక్టివ్ నేతగా ఉన్న ఆమె ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్‌లో చేరారు. ఎంపీగా పోటీచేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌తో పాటే కలిసి నడిచారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరి ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కొన్ని రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు రావడంతో కాంగ్రెస్​తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఆమెకు నచ్చచెప్పారు. అయినా ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆదివారం ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా ఆమె పార్టీలో చేరాల్సిన కార్యక్రమం సోమవారానికి వాయిదా పడింది.

ఉద్యమకారులను టీఆర్ఎస్ విస్మరిస్తోంది : బండి సంజయ్

అమిత్ షాతో విజయశాంతి భేటీ అనంతరం బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అసలైన ఉద్యమకారులను టీఆర్ఎస్​విస్మరిస్తోందని విమర్శించారు. అందువల్లే చాలా మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ పట్ల ఆ పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, ప్రజలు సైతం విసిగిపోయారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది స్పష్టమైందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొట్లాడినట్లుగానే ఇకపైనా బీజేపీ తన పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా అమిత్ షా ప్రోత్సహించారని తెలిపారు. ఇకపైన అన్ని ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు రావాలని చెప్పారన్నారు. జీహెచ్ఎంసీ ప్రచారం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానని వెల్లడించారు.

Advertisement

Next Story