దోచుకోవడంలో పోటాపోటీ.. అవినీతికి కేరాఫ్‌ అమీన్ పూర్ మున్సిపాలిటీ

by Shyam |
దోచుకోవడంలో పోటాపోటీ.. అవినీతికి కేరాఫ్‌ అమీన్ పూర్ మున్సిపాలిటీ
X

దిశ, పటాన్‌చెరు : అమీన్ పూర్ మున్సిపాలిటీలో నిర్మాణాల అక్రమ అనుమతులపై మిసిలినియస్ ఖర్చులపై వెంటనే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి బీరంగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమీన్ పూర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పంచాయతీ అనుమతులతో నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. పాలకవర్గం నిధుల కేటాయింపులో విపక్ష కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. నిర్మాణ అనుమతులలో కేవలం 10 శాతం మాత్రమే మున్సిపల్ అనుమతులు ఉండగా, 90 శాతం పంచాయతీ అనుమతులే ఉన్నాయన్నారు. తాను సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పారని.. ఇప్పుడు ఎలా చెల్లుతున్నాయని ప్రశ్నించారు. అక్రమ అనుమతులిస్తూ పాలకవర్గం, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు.

మిసిలినియస్ చార్జీల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు కేవలం అంకెల్లోనే చూపారు తప్పా పనులు జరగడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకోకపోగా, అంతస్తుకు లక్ష చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కమిషనర్ అధికారిగా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. మున్సిపల్ పరిధిలోని బందంకొమ్ములో బిల్డర్లు రాజ్యమేలుతున్నారని, సర్వే నంబర్ 277, 313, 314, 397, 401లో అక్రమ నిర్మాణాలపై గతంలో తాము ఫిర్యాదు చేస్తే పనులు నిలిపివేశారని, అక్కడున్న వక్ఫ్ బోర్డు భూములను కలుపుకొని రెండెకరాలలో గ్రామపంచాయతీ లే అవుట్, అనుమతులతో ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.

పటేల్ గూడ, ఐలాపూర్, కృష్ణారెడ్డిపేట గ్రామ శివారులోని 208, 137 తదితర సర్వే నెంబర్ల భూమి విషయంలో కూడా తాము ఫిర్యాదు చేశామన్నారు. డీఆర్వో కస్టడీలో ఉన్న 1029,1030,1033,1034,1111 సర్వే నెంబర్లలో కూడా పంచాయతీ అనుమతులతో నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలిపారు. ఇంత జరుగుతున్నా కమిషనర్ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. గతంలో అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, ఆయనకు కూడా వాటాదారునిగా అనుమానించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అడిషనల్ కలెక్టర్ పట్టించుకోని అక్రమ అనుమతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులతో పాటు మిసిలినియస్ ఖర్చులపై ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు పెట్టబోతున్నామన్నారు. ఇండ్ల నిర్మాణ, లే అవుట్ల అక్రమ అనుమతులు పై విచారణ జరిపించాలని కోరుతూ తాము కమిషనర్, అడిషనల్ కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. వారు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని కాట శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, లావణ్య శశిధర్ రెడ్డి, పద్మావతి గోపి, సునీత, మున్నా, నాయకులు భాస్కర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, రవి గౌడ్, మన్నే రవీందర్, రమేష్ యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story