టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వార్నింగ్.. బెదిరిస్తే కేసులు పెడతామంటూ..

by Sridhar Babu |
Madhan-Mohan-Rao-11
X

దిశ, కామారెడ్డి: ఫ్యాక్టరీ పేరుతో రైతుల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని, ఖబర్దార్ ఎమ్మెల్యే సురేందర్ అంటూ జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మదన్ మోహన్ రావు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో జూట్ పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా శుక్రవారం పనులు నిలిపివేయాలని కోర్టు స్టే విధించింది. దాంతో శనివారం కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఇన్ చార్జ్ మదన్ మోహన్ రావు లింగంపల్లి గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గ్రామానికి వచ్చిన ఆయనకు రైతులు డప్పు చప్పుళ్లతో టపాకాయలు కాల్చి ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. లింగంపల్లి గ్రామంలో జూట్ పరిశ్రమ కోసం 40 సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న రైతుల భూములను లాక్కున్నారన్నారు. ఫ్యాక్టరీ కోసం రైతుల భూములు తీసుకొనే ముందు రైతులకు సమాచారం ఇవ్వాలని, వారికి నోటీసులిచ్చి రైతుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. అలా చేయకుండా పనులు ప్రారంభించడం సరికాదన్నారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు సంబంధించిన 620 ఎకరాల భూములను లాక్కోవడమే కాకుండా రైతులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదన్నారు. టెంటులో కూర్చుని నిరసన చేస్తే టెంట్ కూల్చి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రైతుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. భూముల కోసం రైతుల పక్షాన హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. స్పందించిన న్యాయస్థానం స్టే విధించిందని, తదుపరి విచారణ వరకు పనులు నిలిపివేయాల్సిందిగా వెల్లడించిందన్నారు. ఇది రైతుల విజయమన్నారు. సోమవారం మళ్లీ విచారణ ఉందని, రైతుల పక్షాన తాము కోర్టుకు వెళ్తామన్నారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, లేదా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో పోలీసులు రైతులను బెదిరిస్తే వారిపై కూడా కేసులు పెడతామని పేర్కొన్నారు. భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. రైతులకు న్యాయం చేయాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. అనంతరం రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అద్యక్షుడు గజానన్ పటేల్, సదాశివనగర్ మండల పార్టీ అధ్యక్షుడు లింగాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్, సంపత్ గౌడ్, రాజేశ్వర్, కిష్టఫర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story