నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ ఏం లేదు

by Shyam |
Congress leader Jana Reddy
X

దిశ, హాలియ: కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి టీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదని నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విమర్శించారు. మంగళవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టించింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా! అని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. ‘నేను శాసనసభ్యుడిని కాకముందు ఈ ప్రాంతానికి ఏ సౌకర్యం లేదు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు నాగార్జునసాగర్ నియోజకవర్గం మొత్తానికి రోడ్లు, కరెంటు, సాగునీరు, తాగునీరు వసతి ఏర్పాటు చేశానని అన్నారు.

20 ఏండ్ల క్రితమే భూములను సేకరించి దళితులకి, బడుగు బలహీన వర్గాలకు భూమి పంచి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. దళితులకు గత పదేండ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకే విడతలో 1300 వందల కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు. ఉప ఎన్నికల కోసం గత 20 రోజుల నుంచి వివిధ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులను దింపి రాజకీయాల్ని కలుషితం చేసిన ఘనత టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు. ఉప ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి, టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచెప్పాలని సూచించారు.

Advertisement

Next Story